మాలలంతా ఏకం కావాలి.. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి: వివేక్

మాలలంతా ఏకం కావాలి.. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి: వివేక్

ఎల్బీనగర్, వెలుగు: రాష్ట్రంలో ఉన్న మాలలు అందరూ ఏకం కావాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మాలల అభివృద్ధికి కాకా వెంకటస్వామి, ఈశ్వరీ బాయి ఎంతో కృషి చేశారని తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. హైదరాబాద్ చంపాపేట్​లోని మందా యాదవ రెడ్డి గార్డెన్​లో జాతీయ మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మాలల అలయ్ బలయ్ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివేక్ వెంకటస్వామి హాజరై మాట్లాడారు. మాల కులస్తుల్లో ఐక్యత లేదని, జనాభాపరంగా తక్కువగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్నదన్నారు. ఎక్కువ అసోసియేషన్లు ఏర్పాటు చేసుకుని ఇబ్బందిపడొద్దని సూచించారు.

అందరూ ఏకమై సత్తా చాటాలని కోరారు. మాలలు గతంలో.. మాల అని చెప్పుకునేవాళ్లు కాదని తెలిపారు. కానీ.. ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నారని వివరించారు. రాజకీయ రంగంలో మాలలు ఉన్నత స్థాయిలో ఉండాలని బత్తుల శ్యామ్ సుందర్ కోరారని గుర్తుచేశారు. యునైటెడ్ నేషన్స్​లో కూడా ఆయన మాలల సమస్యలపై మాట్లాడారన్నారు.

ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రతి స్కీమ్​లో మాదిగలు లబ్ధి పొందారని, మాల కులస్తులు కూడా అన్ని రంగాల్లో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ రాష్ట్రీయ ఏక్తా మంచ్ నేషనల్ ప్రెసిడెంట్ భవన్ నాథ్ పాశ్వాన్, స్టేట్ ప్రెసిడెంట్ కర్ణం కిషన్, రాష్ట్ర నాయకులు బేర బాలకిషన్, వివిధ జిల్లాల మాల సంఘాల నేతలు పాల్గొన్నారు.