కేసీఆర్ పదేండ్ల పాలనంతా అవినీతి, అక్రమాలే: వివేక్ వెంకటస్వామి

 కేసీఆర్ పదేండ్ల పాలనంతా అవినీతి, అక్రమాలే: వివేక్ వెంకటస్వామి


కేసీఆర్ పదేండ్ల పాలనంతా అవినీతి, అక్రమాలే: వివేక్ వెంకటస్వామి 

  •     పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణ గెలుపు ఖాయం 
  •     ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీకి డిపాజిట్లు దక్కవ్
  •     కోడ్ ముగిసిన వెంటనే అన్ని స్కీంలూ అమలు 
  •     మంచిర్యాల జిల్లా ఎన్ఎస్​యూఐ, యూత్​ కాంగ్రెస్ మీటింగ్ లో స్పీచ్ 

కోల్​బెల్ట్, వెలుగు: పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మోజారిటీతో గెలుస్తారని, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వేల్లో ఇదే తేలిందని చెన్నూరు ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి చెప్పారు. పెద్దపల్లిలో వంశీకృష్ణ గెలుపు ఖాయమైందని, ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్​లో ఎన్ఎస్​యూఐ, యూత్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వివేక్ వెంకటస్వామి, గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ, ఎన్ఎస్​యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, ఎమ్మార్పీఎస్ లీడర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడూతూ.. కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే ప్రజల మధ్య గొడవలు సృష్టించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా ఓపికగా ఉండాలని సూచించారు. ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రజలకు అన్ని పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. సింగరేణి కార్మికుల ఇన్ కం ట్యాక్స్ రద్దు, సొంతింటి పథకం అమలు, కొత్త బొగ్గు గనుల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.  

ఉద్యోగాల పేరుతో మోదీ, కేసీఆర్ మోసం: గడ్డం వంశీకృష్ణ 

కేసీఆర్ తన పదేండ్ల పాలనలో రాష్ట్ర ప్రజల బతుకులను బుగ్గిపాలు చేశారని, ఇంటికో ఉద్యోగం అంటూ నమ్మించి మోసం చేశారని పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో లంచాలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారన్నారు. పదేండ్లుగా దౌర్జన్యాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం పని చేశారని బీఆర్ఎస్ లీడర్లు మళ్లీ ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందన్నారు. అంబేద్కర్ దళితులకు కల్పించిన సమానత్వం, రిజర్వేషన్లు రద్దయ్యేలా ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన బీజేపీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా యువతను మోసం చేసిందన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వకుండా కేసీఆర్ కూడా మోసం చేసిండన్నారు. సింగరేణిని కేసీఆర్ ఒక ఏటీఎం మాదిరిగా వాడుకున్నాడని వంశీకృష్ణ ఫైర్ అయ్యారు. సింగరేణికి రూ. 25 వేల కోట్ల బకాయిలను చెల్లించకుండా సంస్థను నష్టాల్లోకి నెట్టిండన్నారు. కేసీఆర్, మోదీ కలిసి సింగరేణిలోని కొన్ని బొగ్గు బ్లాకులను ప్రైవేట్ కు అప్పగించారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం గత పదేండ్లలో కమీషన్ల కోసమే పని చేసిందన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్​రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, ఆరు గ్యారంటీలను అమలు చేస్తోందన్నారు. తనను చిన్న కొడుకుగా భావించి ఎంపీగా గెలిపించాలని కోరారు.   

వంశీకృష్ణ యువతకు ఉపాధి కల్పిస్తడు: బల్మూరి  

బీజేపీ, బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో చీకటి ఒప్పందం చేసుకున్నాయని బల్మూరి వెంకట్ అన్నారు. గుడి, కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్​ను బొందపెట్టిన తెలంగాణ ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తోపాటు బీజేపీని కూడా భూస్థాపితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోనియాగాంధీ తెలంగాణ కలను నెరవేర్చారని అన్నారు. రాహుల్​గాంధీ ప్రధాన మంత్రి అయితే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకూ అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు. వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా గెలిపిస్తే ఈ  ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలను తీసుకువచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు.  

బిడ్డ కోసం బీఆర్ఎస్ తాకట్టు: తీన్మార్​ మల్లన్న​ 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలులో ఉన్న తన బిడ్డ కవితను విడిపించేందుకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి తాకట్టుపెట్టాడని తీన్మార్ మల్లన్న అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్​ఓట్లను బీజేపీకి వేయించే పనిలో ఉన్నాడన్నారు. ‘‘ఎక్కడైనా అడబిడ్డ సారా దందా చేస్తుందా? ఇది ఎంత ఇజ్జత్ తక్వ ముచ్చట? తలదించుకునే పని చేసిన ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యంలా వస్తుందని కేసీఆర్ అంటున్నాడు. ఎలా పోతుంది ఆ అవినీతి మరక?” అని ఎద్దేవా చేశారు. కేసీఆర్, మోదీ ఇద్దరూ చీటర్ లు అని ఆయన ఫైర్ అయ్యారు. ప్రజలకు, రైతులకు రుణమాఫీ చేయడం చాతకాని మోదీ.. అంబానీ, అదానీలకు మాత్రం లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారన్నారు. సింగరేణిని అదానీ, అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు రద్దవుతాయన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్​ కంపెనీలకు అమ్ముతున్నాడని, ఇక మిగిలింది దేశం, ప్రజలేనన్నారు. కాంగ్రెస్ పేదల కోసం ఉపాధి హామీ పథకం తెచ్చిందన్నారు. కాకా వెంకటస్వామితోనే దేశంలో పెన్షన్ విధానం అమలైందన్నారు. వివేక్ వెంకటస్వామి ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ కోసం తెగించి కొట్లాడారని గుర్తు చేశారు. ఎంతో నిజాయతీ, ఆదర్శవంతమైన కాకా కుటుంబం నుంచి వచ్చిన వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సింగరేణి సంస్థ అదానీ చేతుల్లోకి వెళ్లకూడదంటే.. సంస్థలో కొత్త బావులు, కొత్త ఉద్యోగాలు రావాలంటే వంశీకృష్ణను ఎంపీగా ఢిల్లీకి పంపాలన్నారు.    

ఇండస్ట్రియలిస్టులకే మోదీ సపోర్ట్ 

ఇండస్ట్రియలిస్టులు అంబానీ, అదానీకి ప్రధాని మోదీ అండగా ఉంటే.. కేసీఆర్ కాంట్రాక్టర్ల కొమ్ము కాస్తూ రూ. వేల కోట్ల కమీషన్లు దండుకున్నారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ‘‘వంట గ్యాస్ ధర కాంగ్రెస్ హయాంలో రూ.460 ఉంటే.. మోదీ వచ్చాక దానిని రూ.1,200కు పెంచి అదానీకి దోచిపెడుతున్నారు. పెట్రోల్ ధరను లీటర్​కు రూ.60 నుంచి రూ.110కు పెంచి అంబానీకి ప్రజల సొమ్మును కట్టబెడుతున్నారు. అదానీ, అంబానీలకు రూ. 16 లక్షల రుణమాఫీ చేసిన మోదీ ప్రభుత్వం రైతుల రుణాలు మాత్రం మాఫీ చేయలేదు. సంపన్నులను మరింత సంపన్నులుగా చేయడమే బీజేపీ సర్కార్ విధానం” అని ఆయన విమర్శించారు. అవినీతి, కుంభకోణాలు చేసిన వాళ్లు విదేశాలకు పారిపోయేందుకు మోదీ సహకరించారని ఆరోపించారు. కేసీఆర్ పదేండ్ల పాలన అంతా అవినీతి, అక్రమాలతోనే గడిచిందన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు.