ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్​లో.. బీసీలకు రెండు సీట్లు

ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్​లో.. బీసీలకు రెండు సీట్లు

హైదరాబాద్, వెలుగు : ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లను బీసీలకు కేటాయిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్‌‌ రెడ్డి చెప్పినట్లు ఆ పార్టీ వైస్ ప్రెసిడెంట్ చెరుకు సుధాకర్‌‌‌‌ వెల్లడించారు. సీట్ల కేటాయింపులో ఉదయ్‌‌పూర్ డిక్లరేషన్‌‌ను అమలు చేయబోతున్నట్టు ఆయన తెలిపారు. ఈమేరకు ఆదివాసీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్‌‌, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవితో కలిసి సోమవారం గాంధీభవన్‌‌లో మీడియాతో మాట్లాడారు. బీసీలకు ఇచ్చే సీట్లు ఏవో గుర్తించి, వీలైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ పెద్దలను కోరామని సుధాకర్‌‌‌‌ తెలిపారు. అలాగే, టికెట్ల కేటాయింపులో ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశామన్నారు.

ఈనెల 30వ తేదీన కొల్లాపూర్‌‌‌‌లో కాంగ్రెస్ సభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరవుతారని మల్లు రవి వెల్లడించారు. ఈ సభలోనే మహిళా డిక్లరేషన్‌‌ను ప్రియాంక ప్రకటిస్తారని తెలిపారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి ఎంపీపీ మేఘారెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, ఆయన కొడుకు రాజేశ్ రెడ్డి పార్టీలో చేరుతారని వెల్లడించారు. ఈనెల 29వ తేదీన ప్రకాశం హాల్‌‌లో ‘మణిపూర్ అల్లర్ల వెనుక కుట్ర కోణం”అనే అంశంపై ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని బెల్లయ్య నాయక్ ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల దాకా ఈ మీటింగ్ ఉంటుందన్నారు. ఈ సమావేశానికి పార్టీ స్టేట్ ఇన్​చార్జ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరవుతారని తెలిపారు.