
న్యూఢిల్లీ: ఇండియా చెస్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఈ ఏడాది మెన్స్ చెస్ వరల్డ్ కప్ పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుందని ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ఫిడే) సోమవారం ప్రకటించింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు జరిగే ఈ మెగా టోర్నమెంట్‌కు ఆతిథ్య నగరాన్ని త్వరలో ప్రకటిస్తారు. ఈ టోర్నీలో వరల్డ్ వైడ్ 206 మంది టాప్ ప్లేయర్లు పాల్గొంటారు. నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీలో ఓడినవారు టోర్నీ నుంచి నిష్క్రమిస్తారు.
టాప్–3లో నిలిచే ప్లేయర్లు 2026లో జరిగే క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు క్వాలిఫై అవుతారు. వరల్డ్ నంబర్ వన్, గత వరల్డ్ కప్ విజేత మాగ్నస్ కార్ల్‌సన్ తోపాటు ఇండియా స్టార్లు, వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్, గత వరల్డ్ కప్ రన్నరప్ ఎరిగైసి అర్జున్, ఆర్. ప్రజ్ఞానంద పోటీపడనున్నారు. కాగా, చెస్ వరల్డ్ కప్‌నకు ఇండియా ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. చివరగా 2002లో హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో విశ్వనాథన్ ఆనంద్ విజేతగా నిలిచాడు.