- బౌలర్ల సత్తాపై నమ్మకముంది
- స్మిత్ , వార్నర్ , లబుషేన్ పని పడతారు
- టీమిండియా స్టార్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా
న్యూఢిల్లీ: ఇండియా క్రికెట్‌లో.. ముఖ్యంగా టెస్టుల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సీజన్ 2018-–19. ఎందుకంటే 71 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై మట్టికరిపిస్తూ టెస్టు సిరీస్ నెగ్గి హిస్టరీ క్రియేట్ చేసింది కోహ్లీసేన. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఆసీస్‌తో మళ్లీ సవాల్ కు రెడీ అయింది. ఇప్పటికే కంగారూల గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీ అండ్ కో.. అన్ని ఫార్మాట్ల సిరీస్‌ల్లో ప్రత్యర్థితో పోటీ పడనున్నప్పటికీ.. అందరి దృష్టి టెస్టు వార్‌పైనే నిలిచింది. ఎందుకంటే బాల్ ట్యాంపరింగ్ బ్యాన్ కారణంగా గత సిరీస్‌కు దూరమైన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ వచ్చే నెలలో స్టార్టయ్యే తాజా సిరీస్‌లో బరిలోకి దిగబోతున్నారు. టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్ అయిన ఈ ఇద్దరి రాకతో ఆసీస్ టీమ్ ఈసారి స్ట్రాంగ్‌గా మారనుంది. అయినా సరే 2018–19 సీజన్ రిజల్ట్‌ను రిపీట్ చేస్తామని అంటున్నాడు టీమిండియా స్టార్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా. వార్నర్, స్మిత్‌తో పాటు యంగ్ టాలెంటెడ్ మార్నస్ లబుషేన్‌తో అపోనెంట్ బలంగా మారినప్పటికీ మన బౌలర్ల సత్తాపై పూర్తి నమ్మకం ఉందన్నాడు. కంగారూలపై మన బౌలర్లు మళ్లీ పంజా విసిరితే హిస్టరీ రిపీట్ అవడం ఖాయమని చెబుతున్నాడు.
పేసర్లపై నమ్మకం ఉంది
ఇండియా పేస్ త్రయం జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ గత టూర్ మ్యాజిక్ పెర్ఫామెన్స్‌ను రిపీట్ చేస్తారని పుజారా నమ్మకంగా ఉన్నాడు. డిసెంబర్ 17వ తేదీ నుంచి మొదలయ్యే టెస్టు సిరీస్‌లో ఈ ముగ్గురూ హోమ్‌టీమ్ బ్యాట్స్‌మెన్‌కు ముకుతాడు వేయగలరన్న విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘2018–-19తో పోల్చితే ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ కొంచెం బలంగా మారనుంది. అప్పుడు విజయాలు అంత సులభంగా రావు. ఫారిన్‌లో గెలవాలంటే మనం మరింత హార్డ్ వర్క్ చేయాలి. స్మిత్, వార్నర్, లబుషేన్ గ్రేట్ ప్లేయర్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, మా బౌలర్లలో చాలా మందికి ఇక్కడ జరిగిన గత సిరీస్‌లో ఆడిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. అలాగే, అప్పటితో పోల్చితే మా బౌలింగ్ యూనిట్‌లో పెద్దగా మార్పేమీ లేదు. ముఖ్యంగా జట్టు కోసం ఏం చేయాలో మా ఫాస్ట్ బౌలర్లకు అవగాహన ఉంది. ఆల్రెడీ సక్సెస్ రుచి చూశారు కాబట్టి ఆస్ట్రేలియాలో ఎలా విజయం సాధించాలో వాళ్లకు బాగా తెలుసు. ఈ సిరీస్ కోసం వాళ్ల వద్ద గేమ్ ప్లాన్స్ ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా అమలు చేస్తే స్మిత్, వార్నర్, లబుషేన్‌లను త్వరగా ఔట్ చేయగలరు. గత టూర్‌లో మాదిరి పెర్ఫామెన్స్ చేస్తే మరోసారి సిరీస్ నెగ్గేందుకు మాకు అనేక అవకాశాలు ఉంటాయి’ అని పుజారా చెప్పుకొచ్చాడు.
పింక్‌తో సవాల్ తప్పదు
ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్.. పింక్ బాల్ మ్యాచ్‌తో మొదలవనుంది. అడిలైడ్‌లో జరిగే ఈ డే నైట్ టెస్టులో బ్యాట్స్‌మెన్‌కు కొంత ఇబ్బంది ఉంటుందని పుజారా చెప్పాడు. ముఖ్యంగా సూర్యాస్తమయ టైమ్‌లో పింక్ కూకబురా బాల్‌ను ఎదుర్కోవడం సవాల్‌తో కూడుకున్న పని అన్నాడు. ఇండియా ఇప్పటిదాకా ఒకే ఒక్క డే నైట్ టెస్టును (బంగ్లాదేశ్‌పై) ఎస్జీ పింక్ బాల్‌తో ఆడింది. ‘పేస్, బౌన్స్ మారుతుంది కాబట్టి పింక్ బాల్‌తో ఎప్పుడూ డిఫరెంట్ చాలెంజ్ ఎదురవుతుంది. అలాగే, మేం ఫస్ట్ టైమ్ పింక్ కూకబురాతో ఆసీస్‌లో ఆడబోతున్నాం. అది మరింత డిఫరెంట్‌గా ఉంటుంది. ఫారిన్‌లో ఫస్ట్ డే నైట్ టెస్టులో ఎదురయ్యే సవాళ్లను సమష్టిగా అధిగమించాల్సి ఉంటుంది. ఒక టీమ్‌గా అయినా.. ఇండివిడ్యువల్‌గా అయినా ఈ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. వీలైనంత త్వరగా వాటికి అలవాటు పడాలి. పింక్ బాల్‌తో ఆట కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఇతర సమయాలతో పోలిస్తే సూర్యాస్తమయ సమయంలో మరింత సవాలుగా ఉంటుంది. అయితే, మనం ఎక్కువగా ఆడుతూ, ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దీనికి అలవాటు పడతాం. అందుకు కొంచెం టైమ్ పడుతుంది’ అని 77 టెస్టుల్లో 5840 రన్స్ చేసిన పుజారా అభిప్రాయపడ్డాడు.
నా ప్లాన్స్ నాకున్నాయి
ఆసీస్‌తో టెస్టు సిరీస్ కోసం తాను కూడా స్పెషల్ ప్లాన్స్ రెడీ చేసుకున్నానని, కాకపోతే వాటిని వెల్లడించడం ఇష్టం లేదని చతేశ్వర్ చెప్పాడు. ‘టెక్నికల్ అంశాల గురించి డిస్కస్ చేయడం నాకు ఇష్టం ఉండదు. వ్యూహాత్మక విషయాలను బహిర్గతం చేయకూడదు. లాస్ట్ టూర్‌లో కూడా నేను బాగా ప్రిపేరయ్యా. ఈ సిరీస్‌కు ముందు కూడా అలాంటి ప్రిపరేషన్‌ను రిపీట్ చేయగలనన్న నమ్మకం ఉంది. కొన్ని కొత్త విషయాలను ట్రై చేసి, వాటిని నా ఆటలో భాగం చేస్తుంటా. అది నేను మరింత బెటర్ ప్లేయర్ అవడానికి దోహదపడుతుంది’ అని 32 ఏళ్ల పూజారా చెప్పాడు. కరోనా కారణంగా అందరిలాగే చాన్నాళ్లు ఆటకు దూరంగా ఉన్న చతేశ్వర్.. గత రెండు నెలలు మాత్రం రాజ్‌కోట్‌లోని సొంత అకాడమీలో తండ్రి, చిన్నప్పటి నుంచి కోచ్ అయిన అర్వింద్ పుజారా పర్యవేక్షణలో ట్రెయినింగ్ తీసుకున్నాడు. అయితే, ఇంత పెద్ద టూర్‌కు ముందు టీమ్‌కు తగినంత ప్రాక్టీస్ లేకపోవడం ఇబ్బందేం కాబోదని పుజారా అన్నాడు. ‘ కోట్లాది మంది జీవితాలు ప్రభావితం చేసిన సిచ్యువేషన్ ఇది. ఎంతో మంది తమ ప్రాణాలు కూడా కోల్పోయారు. నార్మల్ టైమ్‌లో అయితే మేం డొమెస్టిక్ క్రికెట్ ఆడి ఆసీస్ వచ్చేవాళ్లం. కానీ, ఇప్పుడు అది సాధ్యం కాలేదు. ఈ టైమ్‌లో అందరూ సేఫ్టీ, సెక్యూరిటీ గురించే ఆలోచిస్తున్నారు కాబట్టి టూర్‌కు ముందు ప్రాక్టీస్ లేకపోవడం పెద్ద విషయమేం కాదు. నా వరకైతే నేను ప్రాక్టీస్ చేయగలిగా. ఫిట్‌నెస్, రన్నింగ్ సెషన్స్‌లో పాల్గొన్నందుకు హ్యాపీగా ఉన్నా’ అని పూజారా పేర్కొన్నాడు.
ఒక్కరితో విజయం రాదు
గత సిరీస్‌లో మూడు సెంచరీలు సహా 500 ప్లస్ రన్స్ చేసిన సౌరాష్ట్ర ప్లేయర్ పుజారా ఇండియా విక్టరీలో కీలక పాత్ర పోషించాడు. అయితే, టెస్టుల్లో ఏ ఒక్కరితోనో విజయాలు సాధ్యం కావని, జట్టంతా సమష్టిగా రాణించాల్సి ఉంటుందని అతను స్పష్టం చేశాడు. ‘ఎవ్వరూ సొంతంగా మ్యాచ్ నెగ్గలేరు. నువ్వు అద్భుతమైన పెర్ఫామెన్స్ చేసినా సరే జట్టు గెలవాలంటే ఇతర ప్లేయర్ల సపోర్ట్ ఉండాల్సిందే. గత సిరీస్‌లో మా బౌలర్లు గొప్పగా పెర్ఫామ్ చేశారు. ఓ టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే 20 వికెట్లు కావాల్సిందే. కాబట్టి నా ఒక్కడి వల్లే విజయాలు రాలేదు. మిగతా బ్యాట్స్‌మెన్ కూడా వివిధ స్టేజ్‌ల్లో బాధ్యత తీసుకున్నారు. అది (గత సిరీస్ విక్టరీ) టీమ్ సక్సెస్. ఇండియా టీమ్ గెలిస్తే అందరికీ గర్వకారణమే కదా’ అని పుజారా గత టూర్ సక్సెస్‌ను గుర్తు చేసుకున్నాడు.
