కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టీటీడీ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేపట్టింది టీటీడీ. ఈ క్రమంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు బుధవారం ( డిసెంబర్ 24 ) సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కలెక్టర్ వెంకటేశ్వర్.
వైకుంఠ ఏకాదశికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రత కల్పిస్తున్నామని..మంత్రుల కమిటీ కూడా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించడం జరిగిందని అన్నారు.గతంలో జరిగిన ఘటనల దృష్టిలో ఉంచుకొని.. అందుకు భిన్నంగా డిసెంబర్ 30, 31 జనవరి 1వ తేదీల్లో రద్దీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఏర్పాట్లు చేపట్టామని అన్నారు. పది రోజుల్లో ఈ డిప్ విధానంతో 1.8 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోనున్నారని తెలిపారు.
►ALSO READ | శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్: వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట..
వైకుంఠ ద్వార దర్శనాల విషయంలో టీటీడీ సామాన్య భక్తులకి అత్యధిక ప్రాధాన్యత కల్పించిందని.. చివరి మూడు రోజలు స్థానికులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.మూడు వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఎక్కడ కూడా ప్రజలు ఎక్కువగా గుమి కూడకుండా నిరంతరం పర్యవీక్షిస్తుంటామని.. నకిలీ టోకెన్ల పై దృష్టి పెట్టి పర్యవేక్షిస్తామని అన్నారు. సోషల్ మీడియాలో నిజాలను మాత్రమే రాయాలని కోరారు.
జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ... శ్రీవారి వైకుంఠ ఏకాదశి దర్శన ఏర్పాట్లపై గట్టి భద్రత చర్యలు చేపట్టామని.. బస్టాండు, రైల్వే స్టేషన్ అలిపిరి ప్రాంతాలలో ఎప్పటికప్పుడు పోలీసులతో నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు పార్కింగ్ సౌకర్యాలను, తాగునీరు ఆహారం ఏర్పాట్లు టిటిడి కల్పిస్తుందని..ఫేక్ టోకెన్ల విక్రయానికి పాల్పడితే కఠిన చర్యలు, జైలు పాలు తప్పదని హెచ్చరించారు.తిరుమలలో 3000 కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టామని.. తిరుపతిలో సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఉంచుతామని అన్నారు.
