చేవెళ్ల బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు పరామర్శ.. చీఫ్ విప్,ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి రూ.20 వేలు సాయం

చేవెళ్ల బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు పరామర్శ..  చీఫ్ విప్,ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి రూ.20 వేలు సాయం

వికారాబాద్, వెలుగు:  చేవెళ్ల బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గురువారం పరామర్శించారు. ఒక్కొక్కరికి తన సొంతంగా రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. యాలాల మండలం పేర్కంపల్లిలో ముగ్గురు బిడ్డలను పొగొట్టుకున్న ఎల్లయ్య గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.

 లక్ష్మీనారాయణపూర్​లో ​అకిలా రెడ్డి, హాజీపూర్ కు చెందిన మృతులు బందెప్ప, లక్ష్మి దంపతుల కుటుంబానికి అండగా ఉంటామన్నారు. బందప్ప పిల్లలు అనాథలు కాకుండా తమ ట్రస్ట్ ద్వారా చదువులు, ఇతర అంశాలలో ఆదుకుంటామన్నారు. అలాగే తాండూరు ఇందిరమ్మ కాలనీలోని సాహెల్, ఖాలీద్​తో పాటు 40 రోజుల పసి పాప కుటుంబానికి, వాల్మీకి కాలనీలో వెంకటమ్మ, విశ్వంభర కాలనీలో తబస్సుమ్, గౌతాపూర్ లోని ముస్కాన్ బేగం, పాత తాండూర్ లోని దస్తగిరి ఇండ్లకు వెళ్లి ఆయన ఆర్థిక సహాయం అందజేశారు.

హన్మంతు కుటుంబానికి పరిహారం

కొడంగల్: చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందిన దౌల్తాబాద్ మండలం నీటూర్​కు చెందిన హన్మంతు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందజేసింది. గురువారం హన్మంతు భార్య కాశమ్మకు రూ. 2 లక్షలు(ఆర్టీసీ), రూ.5లక్షలు(ప్రభుత్వం) పరిహారం చెక్కులను కడా స్పెషల్​ఆఫీసర్​వెంకట్​రెడ్డి, తాండూరు డిపో మెనేజర్ సురేశ్​కలిసి అందించారు. హన్మంతు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. 

రోడ్ల పునర్నిర్మాణం కోసం ర్యాలీ  

చేవెళ్ల బస్సు ప్రమాద మృతులకు నివాళిగా, రోడ్డుల పునర్నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్​లో గురువారం విద్యార్థి, కుల, వైద్యులు, ఉపాధ్యాయ సంఘాలు, ఐఎంఎ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆలంపల్లి సినిమాక్స్ నుంచి ఎన్టీఆర్​ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.సదానంద్​రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్​రాజశేఖర్​రెడ్డి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్​చేశారు. వికారాబాద్​జిల్లాలో రోడ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు తమ ఉద్యమం 
కొనసాగిస్తామన్నారు.