
హైదరాబాద్, వెలుగు: పౌల్ట్రీ పరిశ్రమలకు వ్యవసాయ హోదా కల్పించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. పౌల్ట్రీ పరిశ్రమల యజమానులను రైతులుగా గుర్తించి సబ్సిడీలు అందించాలని కేంద్రాన్ని కోరారు. బుధవారం మాదాపూర్ హైటెక్స్-లో ఇండియన్ పౌల్ట్రీ ఇక్విప్మెంట్ మానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(ఐపీఈఎంఏ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన14వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్ పోను రంజిత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పౌల్ట్రీ ఇండస్ట్రీతోనే పోషకాహార లోపాన్ని అధిగమించడం సాధ్యమని తెలిపారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం,అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారులకు గుడ్లను అందిస్తుందని వెల్లడించారు.
ఇలాంటి పథకాలు దేశంలోని అన్ని ప్రాంతాల్లో అమలు చేయాలన్నారు. కరోనా, ఇతర సమస్యలతో కోళ్ల పెంపకం, గుడ్ల ఉత్పత్తిలో అధిక నష్టం జరిగిందని గుర్తుచేశారు. అందువల్ల పౌల్ట్రీ రైతులకు వ్యవసాయ హోదా కల్పించి సబ్సిడీలు ఇవ్వాలని పౌల్ట్రీ పరిశ్రమ యజమానుల తరఫున కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పౌల్ట్రీ ఇండియా ఎక్స్ పోలో 331జాతీయ, 39 అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. 30 వేల మంది బిజినెస్ విజిటర్స్ ఎక్స్ పోకు తరలివచ్చారు. ఈ ఎక్స్ పో మూడ్రోజుల పాటు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు డాక్టర్ తిరుపతి రెడ్డి, హర్ష రెడ్డి, రామ్ రెడ్డి, పౌల్ట్రీ రైతులు తదితరులు పాల్గొన్నారు.