గోదావరి- కావేరి లింక్​కు​ చత్తీస్​గఢ్ ఓకే

 గోదావరి- కావేరి లింక్​కు​ చత్తీస్​గఢ్ ఓకే

హైదరాబాద్, వెలుగు: గోదావరి – కావేరి నదుల అనుసంధానానికి చత్తీస్​గఢ్​రాష్ట్రం ఓకే చెప్పింది. తాము వాడుకోని148 టీఎంసీలను ఈ ప్రాజెక్టులో వినియోగించుకోవడానికి గ్రీన్​సిగ్నల్​ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు ఎన్వోసీ ఇస్తూ ఇటీవల లేఖ రాసింది. దీంతో గోదావరి(ఇచ్చంపల్లి) – కృష్ణా(నాగార్జున సాగర్)– పెన్నా(సోమశిల) – కావేరి(గ్రాండ్​ఆనికట్) నదుల అనుసంధానానికి అడ్డంకులు తొలగిపోయాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. నేషనల్​వాటర్​డెవలప్​మెంట్​ఏజెన్సీ(ఎన్​డబ్ల్యూడీఏ) చత్తీస్ గఢ్​రాష్ట్రానికి గోదావరిలో ఉన్న వాటా నీళ్లలో148 టీఎంసీలతో గోదావరి – కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టును ప్రతిపాదించింది.

ఆ148 టీఎంసీలను తాము వినియోగించుకునే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మొదట్లో ఆ రాష్ట్రం​అభ్యంతరం వ్యక్తం చేసింది. రిజర్వుడ్​ఫారెస్ట్​నుంచి ప్రవహిస్తున్న ఆ నీటిని చత్తీస్​గఢ్​రానున్న 20 ఏండ్లలో కూడా ఉపయోగించుకునే అవకాశమే లేదని, చత్తీస్​గఢ్​ఆ నీటి వినియోగానికి ప్రాజెక్టులు ప్రారంభించే లోగానే మహానది నుంచి గోదావరి అనుసంధానం పూర్తి చేస్తామని ఎన్ డబ్ల్యూడీఏ హామీ ఇచ్చింది. ఇలా మహానది నుంచి గోదావరికి మళ్లించే 230 టీఎంసీలను గోదావరి – కావేరి అనుసంధానంలో తరలిస్తామని పేర్కొన్నది. కేంద్ర జలశక్తి శాఖ హామీతోనే 148 టీఎంసీల వినియోగానికి చత్తీస్​గఢ్​ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాన అడ్డంకి తొలగిపోవడంతో భాగస్వామ్య రాష్ట్రాలతో ఎంవోయూపై సంతకాలు చేయించడంలో కేంద్రం నిమగ్నమైంది. త్వరలోనే ప్రాజెక్టు ఫైనల్​డీపీఆర్​ను అన్ని రాష్ట్రాలకు పంపనుంది. ఆ తర్వాత అన్ని రాష్ట్రాల ఇరిగేషన్​సెక్రటరీలతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమావేశమై ఎంవోయూలపై సంతకాలు చేయిస్తారు. ఫిబ్రవరిలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్​షెకావత్​అధ్యక్షతన భాగస్వామ్య రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహిస్తారు. ఆ మీటింగ్​లో తుది నిర్ణయం తీసుకొని నదుల అనుసంధానం ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.