హైదరాబాద్, వెలుగు: పండుగలు వచ్చాయంటే మాంసం రేట్లు పెంచడం వ్యాపారులకు ఆనవాయితీగా మారింది. వ్యాపారులపై సర్కారుకు ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో అడ్డగోలుగా రేట్లు పెంచేస్తున్నారు. ఈ సారి కూడా సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా గురు, శుక్రవారాల్లో చికెన్, మటన్ రేట్లను అమాంతం పెంచేశారు.
హైదరాబాద్‌లో కేజీ మటన్ రూ.1,050 నుంచి రూ.1,200 వరకు, చికెన్ ధర రూ.300 నుంచి రూ.350 దాకా పలికింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే స్థాయిలో రేట్లను పెంచి విక్రయించారు. గత నెల చికెన్ రేట్లు రూ.230–250 మధ్య కొనసాగాయి. డిసెంబర్31న రూ.280 వరకు విక్రయించారు. కానీ తాజాగా పండుగ డిమాండ్‌తో చికెన్రేట్లు ఒక్కసారిగా రూ.350కు పెంచేశారు.
అలాగే గత నెలలో రూ.800 వరకు ఉన్న మటన్ రేట్లు ఇప్పుడు రూ.1,000 దాటాయి. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో రూ.1,050 నుంచి రూ.1,200 దాకా విక్రయించారు. నాటు కోళ్లకు కూడా డిమాండ్ పెరగడంతో వాటి రేట్లను కిలో రూ.500 నుంచి రూ.650కి పెంచి అమ్మారు. చికెన్ ధరలు కొండెక్కడంతో చాలా మంది చేపలవైపు మొగ్గు చూపారు.
దీంతో మకర సంక్రాంతి, కనుమ పండుగ వేళ ఫిష్ మార్కెట్లు సైతం రద్దీగా మారాయి. కనుమ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచే చికెన్, మటన్, చేపలు, రొయ్యల కొనుగోలుకు జనం బారులు తీరారు. పండుగ అవసరాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధరలు పెంచేశారని, నాణ్యత లేని గొర్రెలు, మేకల మాంసం కూడా విక్రయించారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
పండుగ రోజుల్లో 400 టన్నుల సేల్స్
జాతీయ మాంస పరిశోధన సంస్థ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో పండుగ రోజుల్లో సగటున 400 టన్నుల మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. తెలంగాణలోనే దేశంలో అత్యధికంగా మాంసాహారం తీసుకునే వారు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో మాంసాహారులు 61.86 శాతం ఉండగా, తెలంగాణలో ఈ సంఖ్య 98.73 శాతంగా ఉంది.
దేశంలో తినే మొత్తం మాంసంలో 60 శాతం తెలుగు రాష్ట్రాల్లోనే వినియోగమవుతుందని ఎన్‌ఆర్‌సీఎం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జాతీయ పౌష్టికాహార సంస్థ సూచన ప్రకారం ఒక్కో వ్యక్తి ఏడాదికి12 కిలోల మాంసం తీసుకోవాలి. కానీ జాతీయ సగటు వినియోగం 2.9 నుంచి 3.26 కిలోల మధ్య ఉండగా, తెలంగాణలో ఒక్కో వ్యక్తి సగటున 9.2 కిలోల మాంసం తీసుకుంటున్నట్టు సర్వేలో తేలింది.
మటన్ రేట్లకు బ్రేక్ ఎక్కడ..?
2018లో కేవలం రూ.560–580 మధ్య ఉన్న మటన్ ధరలు నేడు రూ.1,200 దాటాయి. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే 2030 నాటికి మటన్ ధర కిలో రూ.2,000 దాటినా ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి లేదని నిపుణులు చెప్తున్నారు. చికెన్ దీ ఇదే పరిస్థితి. 2018లో కిలోకు రూ.180 వరకు ఉండగా ప్రస్తుతం రూ.300 దాటింది. ఈ సీజన్లో కోళ్ల ఉత్పత్తి తగ్గడమే ధరలు పెరగడానికి కారణమని పౌల్ట్రీ వర్గాలు అంటున్నాయి.
