చికెన్‌‌ కోసం కొట్టుకున్నరు.. కర్రలతో దాడులు చేసుకున్న స్టూడెంట్స్‌‌

చికెన్‌‌ కోసం కొట్టుకున్నరు..  కర్రలతో దాడులు చేసుకున్న స్టూడెంట్స్‌‌
  • కాకతీయ యూనివర్సిటీ న్యూ పీజీ హాస్టల్‌‌ వద్ద ఘటన

హనుమకొండ, వెలుగు : కాకతీయ యూనివర్సిటీ కామన్‌‌ మెస్‌‌లో ఆదివారం రాత్రి చికెన్ విషయంలో తలెత్తిన గొడవ విద్యార్థుల పరస్పర దాడికి దారి తీసింది. ఇరువర్గాలు కర్రలతో దాడికి పాల్పడటంతో యూనివర్సిటీ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో ఎంబీఏ చదువుతున్న ఓ విద్యార్థి తల పగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్టూడెంట్స్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకతీయ యూనివర్సిటీ మెస్‌‌లో ఆదివారం లంచ్‌‌ టైంలో స్టూడెంట్లకు చికెన్‌‌ పెట్టారు. 

ఈ క్రమంలో మెస్ ఇన్‌‌చార్జిగా వ్యవహరిస్తున్న ఎంఏ ఎకానమిక్స్‌‌ స్టూడెంట్ దుర్గం రజనీకాంత్, ఎంబీఏ స్టూడెంట్స్‌‌ మణికుమార్, అఖిల్, సచిన్, బావుసింగ్‌‌కు మధ్య చికెన్ విషయంలో వాగ్వాదం మొదలైంది. అదనంగా చికెన్‌‌ కావాలని ఎంబీఏ స్టూడెంట్స్‌‌ అడిగారని కొందరు స్టూడెంట్లు చెబుతుండగా.. మెస్ ఇన్‌‌చార్జి రజనీకాంత్‌‌ చికెన్‌‌ను గుట్టుగా తన రూంకు తీసుకెళ్లాడని మరో వర్గం విద్యార్థులు ఆరోపించారు.  

ఇదే విషయమై రాత్రి ఏడు గంటల సమయంలో మహాత్మజ్యోతిబాపూలే హాస్టల్‌‌ వద్ద మరోసారి గొడవ జరుగగా.. తోటి స్టూడెంట్స్ నచ్చజెప్పారు. తర్వాత రాత్రి పది గంటలకు న్యూ పీజీ హాస్టల్‌‌ వద్ద మళ్లీ గొడవపడ్డారు. ఎంఏ ఎకనామిక్స్, ఎంబీఏ స్టూడెంట్స్ రెండుగా గ్రూపులుగా విడిపోయి పరస్పర దాడులకు దిగారు. 

కొందరు స్టూడెంట్లు కర్రలతో దాడులకు దిగడంతో ఎంబీఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్‌‌ బావుసింగ్‌‌ తల పగిలి తీవ్ర రక్తస్రావం జరగడంతో గమనించిన తోటి స్టూడెంట్లు హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే... వర్సిటీ హాస్టల్‌‌లో ఇంత గొడవ జరుగుతున్నా ఆఫీసర్లు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కేయూ పోలీసులు తెలిపారు.