చేపల చెరువుల్లో కోళ్ల పెంపకం

చేపల చెరువుల్లో కోళ్ల పెంపకం
  • వినూత్న పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం
  • ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు
  • రాష్ట్రంలో తొలిసారిగా కొండాపురంలో ఏర్పాటుకు ప్రణాళిక

కోదాడ రూరల్‌‌‌‌‌‌‌‌, వెలుగు:చేపల పెంపకం రైతుకు మంచి ఆదాయాన్ని ఇస్తుంది. అదే రైతుకు మరింత ఆదాయం పెంచేవిధంగా ఆఫీసర్లు సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. అదే చేపల చెరువులో నాటుకోళ్ల పెంపకం. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు చిలుకూరు మండలం కొండాపురానికి చెందిన రైతులు ముందుకొచ్చారు. రాష్ట్రంలో మొట్టమొదటగా ఇక్కడే చేపల చెరువులో నాటుకోళ్ల పెంపకానికి ఆఫీసర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

జాతీయ ఉపాధి హామీ పథకం కింద సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలో అనేక గ్రామాల్లో చేపల చెరువు నిర్మాణంపై రైతులకు అవగాహన కల్పించారు. ముందుకొచ్చిన రైతులకు పొలాల్లో చెరువుల నిర్మాణానికి కసరత్తును ఆఫీసర్లు ప్రారంభించారు. చెరువు ఏర్పాటుకు కేటాయించిన నాలుగు కుంటల్లో ఒక భాగంలో చేపలు, మరో భాగంలో రొయ్యల పెంపకం చేపట్టారు. దీంతోపాటు రైతులకు అధిక ఆదాయ వనరులపై దృష్టి సారించిన ఆఫీసర్లు వినూత్నంగా చేపల చెరువులో నాటుకోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. తద్వారా రైతులకు మరింత ఆదాయం చేకూరుతుంది. ఇందుకోసం చేపల చెరువు మధ్యలో చెక్కలతో ఒక పందిరిలాంటిది ఏర్పాటు చేసి దానిపై ఒక జాలిని ఉంచి షెడ్ నిర్మించాలి.  ఆ షెడ్ లో కోళ్లను పెంచడం వల్ల వాటి పెంటను చేపలు ఆహారంగా తీసుకుంటాయి. తద్వారా పెట్టుబడి లేకుండా చేపలకు ఆహారాన్ని అందించవచ్చు. ఆపై ఎదిగిన కోళ్లను రైతులు అమ్ముకోవచ్చు. అలాగే చేపల చెరువు గట్లపై పండ్లు, పూలు, కలప మొక్కలను పెంచడం ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు. 10 కుంటల్లో చేపల చెరువుల ఏర్పాటుకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 5.65 లక్షలు రైతులకు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఉచితంగా చేప పిల్లల పంపిణీ

ఉపాది హామీ పథకం ద్వారా చేపల చెరువుల నిర్మాణానికి రైతుల నుంచి విశేష స్పందన రావడంతో మరింత ప్రోత్సాహకంగా వారికి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ఆఫీసర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పది కుంటల్లో నిర్మించే చేపల చెరువులో దాదాపు మూడు వేల చేప పిల్లలను పెంచేలా మత్స్యశాఖ నుంచి పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కోదాడ క్లస్టర్ పరిధిలో మండలాల వారీగా  చిలుకూరు 8 చెరువులు, మునగాల 4, కోదాడ 4, మఠంపల్లి 3, మేళ్లచెరువు 2, హుజూర్ నగర్ 3, నడిగూడెం 2, గరిడేపల్లిలో ఒక చేపల చెరువు పెంపకానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆఫీసర్లు తెలిపారు. అయితే ఇక్కడ చేపల చెరువుతో పాటు రొయ్యలు పెంపకం చేసే రైతులు రొయ్యల విత్తనాన్ని వారే భరించాల్సి ఉంటుంది.

పెంపకంలో మెలకువలు పాటించాలి

చేపల చెరువుతోపాటు రొయ్యల పెంపకం, నాటుకోళ్లు, గట్టుపై కలప మొక్కల పెంపకం వంటిఇతర ఆదాయ వనరులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం . గడ్డిపల్లి కేవీ కే పరిశోధనా కేంద్రంఫిషరీ విభాగం శాత్రవేత్త నర్సిం హారావు తో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి రైతులకు చేప పిల్లలసరఫరా, పెంపకం, దాణా సమకూర్చడం వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నాం . చేపల చెరువునిర్మాణం అనంతరం చేపల పోషణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నిరంతరం చెరువులో నీళ్లు లేతఆకుపచ్చ రంగులో ఉండేలా చూసుకోవాలి. నీళ్లు ముదురు రంగులోకి మారితే సరైన ఆహార పోషణచేపలకు అందడం లేదని గుర్తించాలి . ఇలా అన్నీ విషయాలపై అవగాహన కల్పించి ఈ పథకాన్నిఅత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం .