చికెన్నెక్‌‌ను ఏనుగు మెడలా మార్చాలి: సద్గురు జగ్గీ వాసుదేవ్‌

చికెన్నెక్‌‌ను ఏనుగు మెడలా మార్చాలి: సద్గురు జగ్గీ వాసుదేవ్‌

బెంగళూరు: భారత ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే 22 కిలోమీటర్ల ఇరుకైన సిలిగురి కారిడార్ (చికెన్​నెక్‌‌)ను పటిష్టం చేయాలని ఈషా ఫౌండేషన్‌‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌‌ అన్నారు. చికెన్​నెక్‌‌ను ఏనుగు మెడలాగ మార్చాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.  సోమవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో జగ్గీ వాసుదేవ్‌‌ మాట్లాడారు.  1947 విభజన సమయంలో జరిగిన ఈ లోపాన్ని.. 1971లో బంగ్లాదేశ్ విముక్తి సమయంలోనే సరిదిద్ది ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

 అది భారత్ వదులుకున్న గొప్ప అవకాశమని  పేర్కొన్నారు. దేశ సమగ్రత అనేది ఎప్పుడూ బలహీనమైన పునాదులపై ఉండకూడదని, ప్రస్తుతం ఉన్న భౌగోళిక పరిస్థితులు దేశ భద్రతకు సవాలుగా మారాయని  ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, హిందూ మైనారిటీలపై దాడులు, అక్కడ పెరుగుతున్న భారత వ్యతిరేక ధోరణుల నేపథ్యంలో సద్గురు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

కఠిన నిర్ణయాలు తీసుకోవాలి..

ఇరుకైన సిలిగురి కారిడార్‌‌‌‌ ప్రాంతాన్ని రక్షణ పరంగా, వ్యూహాత్మకంగా మరింత దృఢంగా మార్చాలని సద్గురు పేర్కొన్నారు.  కారిడార్‌‌ను విస్తరించడానికి లేదా పటిష్టం చేయడానికి అవసరమైన పోషకాలు  లేదా మందులు ఇవ్వాలని, అంటే దౌత్యపరంగా లేదా వ్యూహాత్మకంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక దేశం కేవలం ఆశయాలతో నడవదని, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి అవసరమైన కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

 దేశ భద్రత కోసం చేసే పనులకు ఎప్పుడూ కొంత మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, కానీ భవిష్యత్తు దృష్ట్యా అది తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచం మొత్తం సరిహద్దులు లేని ఒకే కుటుంబంలా ఉండాలనేది గొప్ప ఆశయమే అయినప్పటికీ.. నేటి పరిస్థితుల్లో దేశ రక్షణే ముఖ్యమని చెప్పారు. యూరప్ దేశాలు యుద్ధాల తర్వాత ఎలాగైతే ఐక్యంగా మారాయో, భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రావొచ్చని తెలిపారు.