- దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో ‘పులుల గణన’పై ఆఫీసర్లకు శిక్షణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పక్కాగా పులులు, ఇతర జంతువుల గణనతో పాటు వాటి ఆవాసాలపై సర్వే చేపట్టాలని అధికారులను అటవీ ముఖ్య సంరక్షణాధికారి డాక్టర్ సువర్ణ ఆదేశించారు. గురువారం దూలపల్లి అటవీ అకాడమీలో ఫీల్డ్ అధికారులతో కలిసి ‘అఖిల భారత పులుల అంచనా’ (ఏఐటీఈ)–2026పై ఒకరోజు శిక్షణ వర్క్‌షాప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సువర్ణ మాట్లాడుతూ అఖిల భారత పులుల అంచనా దేశవ్యాప్తంగా జరిగే అతిపెద్ద వన్యప్రాణి అంచనా ప్రక్రియ అని పేర్కొన్నారు. ఈ సర్వేలో పులుల సంఖ్య మాత్రమే కాకుండా, వాటి ఆవాస ప్రదేశాలు, ఇతర వేటాడే జంతువులు, జీవవైవిధ్య పరిస్థితులు వంటి అంశాలను అంచనా వేయాలని సూచించారు.
ఈ సర్వేలో ప్రధానంగా అడవుల పూర్తి సమాచారాన్ని సేకరిస్తారని, అడవుల్లో వేటాడే, శాకాహార జంతువులు, చెట్లు, ముళ్లపొదలు, నీటి వనరులు, అగ్నిప్రమాదాల ప్రభావం, పశు సంపద, ఇతర జీవరాశులపై డేటా సేకరిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని అటవీ ప్రాంతాల్లో సుమారు 3,200 బీట్లలో, వచ్చే నెలలో 6 రోజుల పాటు ఈ సర్వే నిర్వహిస్తామన్నారు.
సేకరించిన డేటా ‘పులుల పర్యవేక్షణ వ్యవస్థ - ఇంటెన్సివ్ ప్రొటెక్షన్, పర్యావరణ స్థితి’ అనే మొబైల్ అప్లికేషన్ లో నమోదు చేస్తామని, ఈ యాప్ ద్వారా ఫీల్డ్‌లో సేకరించిన సమాచారాన్ని నేరుగా నేషనల్ డేటాబేస్‌లోకి పంపిస్తామన్నారు. దీనికి సంబంధించిన సాంకేతిక మార్గదర్శకాలు, యాప్ వినియోగం, డేటా ఎంట్రీ విధానం వంటి అంశాలపై డీఎఫ్ఓలు, ఎఫ్డీఓలు, ఎఫ్ఆర్ఓలకు సమగ్ర శిక్షణ ఇచ్చామన్నారు. అకాడమీలో శిక్షణ పొందిన అధికారులు.. క్షేత్రస్థాయిలోని బీట్ ఆఫీసర్లకు శిక్షణ ఇస్తారని తెలిపారు.
