ఆధార్, ఓటర్ ఐడీ లింక్​ చెయ్యొద్దనుకుంటే కారణాలు చెప్పాలి

V6 Velugu Posted on May 15, 2022

న్యూఢిల్లీ: ఓటర్​ ఐడీ కార్డుతో ఆధార్​ను లింక్​ చెయ్యడం, చెయ్యకపోవడం ప్రజల ఇష్టమని, అయితే, లింక్​ చెయ్యొద్దనుకుంటే సరైన కారణాలు చెప్పాల్సి ఉంటుందని చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్​ (సీఈసీ) సుశీల్​ చంద్ర చెప్పారు. ఓటర్​ ఐడీతో ఆధార్​ను లింక్​ చేసే విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే రూల్స్​ వస్తాయన్నారు. ఆదివారం ఆయన సీఈసీగా రిటైర్​ అవుతున్న నేపథ్యంలో శనివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో రెండు ముఖ్యమైన సంస్కరణలను తీసుకొచ్చానని చెప్పారు. ఒకటి ఓటర్​ఐడీకి ఆధార్​ను లింక్​ చెయ్యడం, 18 ఏండ్లు నిండిన యువత ఓటర్​గా నమోదు చేసుకోవడానికి ఒక్క ఏడాదిలో నాలుగు తేదీలను ఖరారు చేయడం వంటి కొత్త రూల్స్​ను తీసుకొచ్చానని తెలిపారు. 

అంతకన్నా కారణాలేముంటయ్​?

ఆధార్​ను లింక్​ చేసుకోవడం స్వచ్ఛందమే అయినా.. లింక్​ చెయ్యకుంటే ఎందుకు వద్దనుకుంటున్నారో సరైన కారణాలూ ఇవ్వాల్సి ఉంటుందని సీఈసీ సుశీల్​ చంద్ర చెప్పుకొచ్చారు. ‘‘ఆధార్​ లేదు, అప్లై చేసినా ఆధార్​ రాలేదు లేదా మరో కారణమేదైనా ఉండొచ్చు. నాకు తెలిసి అంతకు మించిన కారణాలు ఏముంటాయ్​?’’ అని ఆయన అన్నారు. ఆధార్​ నంబర్లను ఇవ్వడం వల్ల ఎన్నికల సంఘం బోగస్​ ఓటర్లను గుర్తించగలుగుతుందన్నారు. అంతేగాకుండా ఓటర్లకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు వీలవుతుందని చెప్పారు. ఓటర్లు నమోదైన బూత్​ల వివరాలు, ఎన్నికలు ఎప్పుడు జరిగేది వంటి వివరాలను వారి ఫోన్​ నంబర్​కే పంపించగలుగుతామని వివరించారు. 

ఓటర్ల నమోదుకు 4 తేదీలు..

మొన్నటిదాకా ఏటా జనవరి 1నే కొత్త ఓటర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉండేదని సుశీల్​ చంద్ర చెప్పారు. దాని వల్ల ఆ తేదీ తర్వాత 18 ఏండ్లు నిండిన యువత ఓటరుగా నమోదయ్యేందుకు చాలా రోజులు వేచి చూడాల్సి వచ్చేదన్నారు. కానీ, తాను వచ్చిన తర్వాత మరికొన్ని ఆప్షన్లు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపానని, దానికి ప్రభుత్వం ఒప్పుకొందని చెప్పారు. అందులో భాగంగా ఒక ఏడాదిలో నాలుగు తేదీల్లో కొత్త ఓటర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం దొరికిందన్నారు. ఈ సంస్కరణను 20 ఏండ్లుగా పెండింగ్​లో పెట్టారని ఆయన గుర్తు చేశారు. ఇటీవల పార్లమెంట్​లో ప్రవేశపెట్టిన ఆధార్ - ​ఓటర్​ ఐడీ లింకింగ్​ బిల్లులో ఈ రూల్​ కూడా ఉందని చెప్పారు. వీటికి సంబంధించి అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం రూల్స్​ను విడుదల చేస్తుందని పేర్కొన్నారు.

Tagged rules, voter list, Chief Election Commissioner Sushil Chandra, Linking Aadhar Card

Latest Videos

Subscribe Now

More News