న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం .. విచారణల్లో దశాబ్దాల జాప్యం ఆందోళనకరం: సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్

న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం .. విచారణల్లో దశాబ్దాల జాప్యం ఆందోళనకరం: సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్
  • నిర్దోషులు ఏండ్ల తరబడి జైళ్లలో గడిపిన సందర్భాలూ ఉన్నయ్​
  • న్యాయవ్యవస్థలోని సవాళ్లను సరిదిద్దాల్సి ఉంది
  • అడ్వకేట్లకు ఆలోచనలతోపాటు మానవత్వం, వినయమూ ఉండాలి
  • నిరంతరం తమను తాము నిరూపించుకోవాలి
  • ఒత్తిళ్లకు తలొగ్గి విదేశీ విద్యవైపు స్టూడెంట్లు వెళ్లొద్దు 
  • ఏఐ, డేటా ప్రైవసీతో అనుకూల, ప్రతికూల ప్రయోజనాలు
  • చేసే పనిని ప్రేమిస్తేనే సరైన ఫలితాలు వస్తాయని సూచన
  • నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో స్నాతకోత్సవానికి హాజరు

హైదరాబాద్​, వెలుగు: న్యాయవ్యవస్థ ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నదని.. వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని, సంస్కరణలు జరగాలని  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ బీఆర్ గవాయ్ అన్నారు. ‘‘ట్రయల్స్‌‌లో జాప్యం, కేసుల విచారణ కొన్నిసార్లు దశాబ్దాల పాటు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. కొందరు అండర్ ట్రయల్ ఖైదీగా ఏండ్ల తరబడి జైలు జీవితం గడిపాక నిర్దోషులుగా తేలిన సందర్భాలు ఉన్నాయి. నిర్దోషులు అలా జైళ్లలో మగ్గడం ఆందోళనకరం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

 హైదరాబాద్‌‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో శనివారం జరిగిన స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ అధ్యక్షత వహించగా.. సీఎం రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పీఎస్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. సీజేఐ జస్టిస్​ గవాయ్​ మాట్లాడుతూ.. మనలోని అత్యుత్తమ ప్రతిభ మనం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి సహాయపడాలన్నారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారు కుటుంబ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని.. తోటివారి ఒత్తిడి కారణంగా విదేశీ విద్య వైపు వెళ్లవద్దని సూచించారు. 

విదేశీ డిగ్రీలతో మాత్రమే మన టాలెంట్ పెరుగుతుందని అస్సలు అనుకోవద్దన్నారు. మన దేశంలో కూడా నాణ్యమైన న్యాయవిద్య ఉందని ఆయన  తెలిపారు. విదేశాల్లో చదువుకోవాలని భావిస్తే అది స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌లపై మాత్రమే వెళ్లాలని సూచించారు. న్యాయవాదులు నిరంతరం తమను తాము నిరూపించుకోవాలని,  కోర్టు తీర్పులకు సంబంధించి సమగ్ర అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏఐ, డేటా ప్రైవసీ విషయంలో అనుకూల, ప్రతికూల ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. సరైన మార్గదర్శకత్వం ఉంటేనే.. నైపుణ్యం సాధించగలమని, మెంటార్‌‌‌‌షిప్‌‌‌‌ను ఒక బాధ్యతగా భావించాలన్నారు. ‘‘వృత్తిని, చేసే పనిని ప్రేమించాలి. అప్పుడే సరైన ఫలితాలు పొందగలుగుతాం” అని ఆయన  పేర్కొన్నారు. 

మానవత్వం, వినయమూ ఉండాలి

న్యాయవాదికి ఒకే ఒక్క నమూనా అంటూ ఏదీ లేదని, ప్రతిఒక్కరూ తమదైన శైలిలో రాణించడానికి ఈ వృత్తిలో తగినంత స్పేస్​ ఉందని సీజేఐ జస్టిస్​ గవా య్ పేర్కొన్నారు. న్యాయవాదులు కేవలం ఆలోచించడమే కాకుండా మానవత్వం, వినయం కలిగి ఉండాలన్నారు. జబ్బు చేసినప్పుడే డాక్టర్​ వద్దకు వెళ్లడం కాదని, నివారణే ఉత్తమ మార్గమని, రెగ్యులర్ హెల్త్ చెకప్‌‌‌‌లను జీవితంలో భాగం చేసుకోవాలని సీజేఐ జస్టిస్ ​గవాయ్​ సూచించారు. ఉత్తీర్ణులైన గ్రాడ్యు యేట్లు తమ శక్తి కోసం కాకుండా చిత్తశుద్ధి కోసం మార్గదర్శకులను ఎంచుకోవాలన్నారు. వర్ణ వివక్ష, సామాజిక వివక్ష వంటి అణచివేత వ్యవస్థలను సవాల్​ చేసిన న్యాయవాదుల వారసత్వాన్ని లా గ్రాడ్యుయేట్లు కొనసాగించాలని ఆయన సూచించారు. 

వర్సిటీ వీసీ ప్రొఫెసర్  శ్రీకృష్ణదేవరావు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నివారణ) చట్టం కింద ప్రత్యేక కోర్టులను ఆధునీకరించడంపై సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖతో కలిసి నల్సార్ ఇటీవల పనిచేసిందన్నారు. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఢిల్లీలోని ప్రాజెక్ట్ 39ఏ (మరణ శిక్షకు సంబంధించిన ప్రాజెక్ట్) నల్సార్‌‌‌‌కు తరలివచ్చిందని చెప్పారు. వర్సిటీకి నిరంతర మద్దతు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. స్నాతకోత్సవంలో పీహెచ్‌‌‌‌డీ, ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌ఎం, ఎంబీఏ, ఎంఏ (టాక్సేషన్ లాస్), ఎంఏ (క్రిమినల్ జస్టిస్ మేనేజ్‌‌‌‌మెంట్), బీఏ ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌బీ ఆనర్స్, బీబీఏ (ఆనర్స్), బీబీఏ, పీజీ డిప్లొమా ఇన్ టాక్సేషన్ లాస్, పీజీ డిప్లొమా ఇన్ క్రిమినల్ జస్టిస్ మేనేజ్‌‌‌‌మెంట్ వంటి కోర్సుల స్టూడెంట్లకు పట్టాలు ప్రదానం చేశారు.