అహింసా మార్గంలో తెలంగాణ సాధించుకున్నాం

అహింసా మార్గంలో తెలంగాణ సాధించుకున్నాం

గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేసిన కేసీఆర్ 

జాతీయోద్యమ స్ఫూర్తితో, అహింసా మార్గంలో, శాంతియుత పంథాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. స్వాతంత్ర్య పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగించుకుంటున్నామని చెప్పారు. స్వతంత్ర భారతంలో 60 సంవత్సరాలు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమించిన తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించి, నేడు దేశానికే దిక్సూచిగా మారి దేదీప్యమానంగా వెలుగొందుతోందని అన్నారు. ప్రతి రంగంలోనూ దేశం నివ్వెరపోయే ఫలితాలు సాధిస్తూ, ప్రగతి పథంలో రాష్ట్రం పరుగులు పెడుతోందన్నారు. ప్రజల ఆశీర్వాద బలం, ప్రజా ప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్ల తెలంగాణ రాష్ట్రం అపూర్వ విజయాలు సొంతం చేసుకుంటోందన్నారు. గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. 

దేశ నిర్మాణంలో బలమైన ఆర్థికశక్తిగా తెలంగాణ
దేశ నిర్మాణంలో బలమైన ఆర్థికశక్తిగా తెలంగాణ రూపొందిందని అన్నారు. సమైక్య రాష్ట్రంలో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ.. ఇవాళ అన్ని రంగాలకు 24 గంటలపాటు విద్యుత్తును అందిస్తూ.. ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంతో సతమతమైన తెలంగాణ నేడు స్వరాష్ట్రంగా 11.6 శాతం రికార్డు స్థాయి వ్యవసాయ వృద్ధిరేటుతో దేశానికి అన్నం పెడుతూ అన్నపూర్ణగా అవతరించిందని చెప్పారు. ఇంటింటా నల్లాలతో స్వచ్ఛమైన తాగునీటిని 100 శాతం గ్రామాలకు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. గొర్రెల పెంపకంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందన్నారు. 12.01 శాతం ఉత్పత్తి రంగ వృద్ధిరేటుతో పారిశ్రామిక ప్రగతిలో అగ్రగామిగా తెలంగాణ నిలిచిందని వివరించారు. ఐటీ రంగ ఎగుమతుల్లో  దేశంలోనే అత్యధికంగా 26.14 శాతం వృద్ధిరేటుతో అప్రతిహతంగా దూసుకుపోతున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ‘తెలంగాణకు హరితహారం’ పథకం సాధించిన ఫలితాలతో రాష్ట్రం ఎటు చూసినా ఆకుపచ్చదనంతో అలరారుతోందని చెప్పారు. ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవధిలో తెలంగాణ అత్యంత బలమైన ఆర్థికశక్తిగా ఎదిగిందని చెప్పారు. రాష్ట్రం అవతరించిన మొదటి సంవత్సరం 2014-15లో రాష్ట్ర ఆదాయం రూ. 62 వేల కోట్ల రూపాయలు ఉంటే.. 2021 నాటికి 1 లక్షా 84 వేల కోట్ల రూపాయలకు పెంచుకోగలిగామని చెప్పారు. ఏడేండ్లలోనే తెలంగాణ రాష్ట్ర రాబడి మూడు రెట్లు పెరిగిందన్నారు. నేడు దేశంలోనే బలమైన ఆర్థిక సంపత్తి కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందన్నారు. 

11.5 శాతం వృద్ధిరేటుతో తెలంగాణ 

గత ఏడేండ్లుగా రాష్ట్ర స్వంత పన్నుల ఆదాయం (ఎస్.ఓ.టి.ఆర్)లో 11.5 శాతం వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని, ఇదే విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వెల్లడించిందని తెలిపారు. ఇది మన రాష్ట్రానికి గర్వకారణమని, ఆషామాషీగానో, అయాచితంగానో ఈ పెరుగుదల రాలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పాటించిన ఆర్థిక క్రమశిక్షణ, అడుగడుగునా ప్రదర్శించిన పారదర్శకత, అవినీతిరహిత పరిపాలన వల్లనే రాష్ట్ర ఆదాయ వనరుల్లో అనూహ్యమైన పెరుగుదల సాధ్యమైంది చెప్పారు. 2014, 15లో రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జీ.ఎస్.డి.పి.  5 లక్షల 5 వేల 849 కోట్ల రూపాయలు కాగా, 2021-22 నాటికి 11 లక్షల 48 వేల 115 కోట్ల రూపాయలకు చేరిందని చెప్పారు. గత ఏడేండ్లలో రాష్ట్ర జి.ఎస్.డి.పి 127 శాతం పెరిగిందని, అదే సమయంలో దేశ జీడీపీ 90 శాతం మాత్రమే పెరిగిందన్నారు. తెలంగాణ వృద్ధి రేటు భారతదేశ వృద్ధిరేటుకంటే 27 శాతం అధికంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుత ప్రగతికి ఇది ప్రబల నిదర్శనమని చెప్పారు. 

అన్ని రంగాల్లోనూ అభివృద్ధి
2013, 14లో సుమారు 1 లక్ష రూపాయలు మాత్రమే ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం, రాష్ర్ట ప్రభుత్వ కృషి వల్ల 2021, 22 నాటికి  2 లక్షల 75 వేల రూపాయలకు పెరిగిందని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రస్తుత జాతీయ తలసరి ఆదాయం 1 లక్ష 50 వేల రూపాయల కంటే రాష్ట్ర తలసరి ఆదాయం 84 శాతం అధికంగా ఉండటంగర్వించాల్సిన విషయమని చెప్పారు. జాతీయ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం అంతకంతకూ పెరుగుతూనే ఉందని, ఇది శుభపరిణామం అని అన్నారు. గత ఏడేండ్లలో వ్యవసాయం దాని అనుబంధ రంగాల పరిమాణం రెండున్నర రెట్లు పెరిగిందని, అదే సమయంలో పారిశ్రామిక రంగం 2 రెట్లు, సేవా రంగం 2. 2 రెట్లు పెరిగాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లోనూ అభివృద్ధి గతం కన్నా రెట్టింపు స్థాయిలో సాగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల మీద, వ్యవసాయ రంగం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో అత్యధిక అభివృద్ధి సాధ్యమైందన్నారు. 

దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు 
స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా నిర్వహించుకుంటున్న తెలంగాణ ప్రజలకు, యావత్ భారతజాతికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి భారతీయుని హృదయం ఉప్పొంగిపోయే విశిష్ట సందర్భమిది అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిందన్నారు. 1 కోటి 20 లక్షల జెండాలను రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ కార్మికుల చేతులతోనే తయారు చేయించి ఇంటింటికీ ఉచితంగా అందజేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు తెలంగాణ ప్రజానీకం ప్రతి ఇంటిపై జాతీయ పతాకాలను ఎగరేయటంతో యావత్ రాష్ట్రం త్రివర్ణశోభితమై మెరిసి.. మురిసి పోతుందని అన్నారు.

మహానీయుల త్యాగాలను స్మరించుకోవాలి
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా దేశం స్వేచ్ఛా వాయువులను పీల్చుకోవడం కోసం తమ ప్రాణాలను ధారపోసిన మహానీయుల త్యాగాలను ఘనంగా స్మరించుకోవటం అందరి బాధ్యత అని సీఎం కేసీఆర్ అన్నారు. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రను, ఆదర్శాలను, విలువలను నేటితరానికి తెలియజేయాలనే సత్సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను నిర్వహిస్తందని, ఈనెల 22వ తేదీ వరకు దేశభక్తిని చాటే అనేక కార్యక్రమాలను రాష్ట్రమంతటా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. ఎందరో మహనీయుల  త్యాగఫలంతో ఇవాళ మనమందరం అనుభవిస్తున్న  స్వాతంత్ర్యం అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ, నవభారత నిర్మాణంలోనూ మహోన్నతమైన పాత్ర పోషించిన తొలిప్రధాని  జవహర్ లాల్ నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్, మహోన్నత తాత్వికుడు, సంస్కర్త, భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహానుభావుల సేవలు చిరస్మరణీయం అని గుర్తు చేశారు. భారత స్వాతంత్ర్య సముపార్జన కోసం దేశమంతటా జరిగిన పోరాటంలో తెలంగాణ వీరులు ఉజ్వలమైన పాత్రను పోషించారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. తుర్రేబాజ్ ఖాన్, రాంజీ గోండు, మౌల్వీ అలావుద్దీన్, భారత కోకిల సరోజినీ నాయుడు, సంగెం లక్ష్మీబాయి, రామానంద తీర్థ, పీవీ నర్సింహారావు మొదలైన వారు సాహసోపేతంగా చేసిన పోరాటం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని తెలిపారు. కాగా, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అమర జవాన్ల స్మృతి చిహ్నం వద్ద సీఎం కేసీఆర్ నివాళులర్పించారు.