హైదరాబాద్ తరహా అభివృద్ధి రాష్ట్రమంతా జరగాలి : సీఐఐ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ తరహా అభివృద్ధి రాష్ట్రమంతా జరగాలి : సీఐఐ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి

2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలనే భవిష్యత్తు లక్ష్యంతో మెగా మాస్టర్ పాలసీ  రూపకల్పన చేస్తామనిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం సెక్రెటేరియట్లో భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ ప్రాంతంలో 1994 నుంచి 2004 వరకు పరిశ్రమల అభివృద్ధికి అనుసరించిన ఫార్ములా ఒక తీరుగా ఉంటే..  2004 నుంచి 2014 వరకు అది మరో మెట్టుకు చేరుకుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇది అత్యున్నత వృద్ధి దశకు(నెక్స్ట్ లెవల్ డెవెలప్ మెంట్) చేరుకోవాలనే లక్ష్యంతో  ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

జహీరాబాద్ లో  ఐటీ, ఫార్మా, హెల్త్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్,  ఆటోమొబైల్, ఆర్గానిక్ క్లస్టర్లుగా అక్కడ పరిశ్రమల ఏర్పాటు జరగాలని అన్నారు. రక్షణ రంగం, నావికా రంగానికి అవసరమైన పరికరాల తయారీ, ఉత్పత్తికి హైదరాబాద్ లో అపారమైన అవకాశాలున్నాయని, పారిశ్రామికవేత్తలు వీటిపై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.  కొత్తగా సోలార్ పవర్ పాలసీని రూపొందిస్తామని, సోలార్ ఎనర్జీ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. 

తెలంగాణ సుమారు 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, గత ప్రభుత్వం తరహాలో వీరిని తాము భారంగా భావించటం లేదని అన్నారు. వీరందరినీ పరిశ్రమల అభివృద్ధిలో పాలుపంచుకునే మానవ వనరులుగా భావిస్తున్నామని తెలిపారు. యువతీ యువకులకు స్కిల్స్ నేర్పించేందుకు స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పుతామని అన్నారు. స్కిల్ యూనివర్సిటీల్లో డిగ్రీలు పొందిన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని, పోటీ ప్రపంచంలో ఎక్కడైనా నిలదొక్కుకునే సామర్థ్యం వాళ్ల సొంతమవుతుందని అన్నారు. 

భారత ప్రారిశ్రామిక సమాఖ్య.. సీఐఐ ప్రతినిధుల సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఐటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్  రంజన్, విశాఖ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గడ్డం వంశీ కృష్ణ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులు సి. శేఖర్ రెడ్డి, అనిల్ కుమార్,  డాక్టర్ మోహన్ రెడ్డి,  సతీష్ రెడ్డి, శ్రీమతి సుచిత్రా కె ఎల్లా,  శ్రీమతి వనిత దాట్ల, రాజు, సంజయ్  సింగ్, ప్రదీప్ ధోబాలే, శక్తి సాగర్,  వై హరీష్ చంద్ర ప్రసాద్, గౌతమ్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి రాచమల్లు,  రామ్, చక్రవర్తి, షైక్ షామి ఉద్దీన్, వెంకటగిరి, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.