
క్యాసినో హవాలా కేసులో చికోటి ప్రవీణ్ ఈడీ ఎదుట హాజరు కానున్నారు. రెండో రోజు ఆయన్ను అధికారులు విచారించనున్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసులో జేడీ అభిషేక్ గోయల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ టీమ్ ఆయన్ను విచారిస్తోంది. నిన్న 11 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. క్యాసినో నిర్వహణ , నగదు చెల్లింపుల పై ఈడి ఆరా తీస్తోంది. ఇక్కడి నుండి ఇతర దేశాలకు కస్టమర్లను తరలించే ముందు కాయిన్స్ విధానం ప్రవేశ పెట్టాడని నిర్ధారించారు. క్యాసినో ఆడేందుకు కస్టమర్ల నుండి నగదు తీసుకుని వారికి ఇక్కడే కాయిన్స్ లు జారీ చేసినట్లు అనుమానిస్తున్నారు. విదేశాల్లో ఆడాలంటే ఇక్కడి కరెన్సీని ఫారిన్ ఎక్సేంజ్ చేయాలి కాబట్టి.. కాయిన్స్ విధానం అమలు చేశాడని సమాచారం. క్యాసినో ముగిశాక ప్రైజ్ మనీ సైతం కాయిన్స్ విధానంలోనే చెల్లింపులు చేశాడని విచారణలో తేలినట్లు తెలుస్తోంది. విదేశాల్లో కాయిన్ తీసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చాక నగదు చెల్లింపులు చేసినట్లు ఈడీ భావిస్తోంది. చెలింపుల ద్వారా ఫెమా ఉలంఘనకు చికోటి అండ్ టీమ్ పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఈ క్రమంలో విదేశీ ఖాతాలను సైతం గుర్తించారు. వాటి ద్వారా ఎలాంటి చెల్లింపులు జరిగాయో పరిశీలిస్తున్నారు. చికోటికి సంబంధించిన ల్యాప్ టాప్ లో డేటాను విశ్లేషిస్తున్నారు. థాయిలాండ్, నేపాల్, ఇండోనేషియా సహా మొత్తం 7 దేశాల్లో నిర్వహిస్తున్న క్యాసినోలకు పెట్టుబడులు పెట్టిన వారి గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఈవెంట్స్‌లో పాల్గొన్న వారి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ పేమెంట్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పించాలని ఆదేశించారని తెలిసింది. సోమవారం రాత్రి 9 గంటల తర్వాత స్టేట్‌మెంట్స్‌పై వారితో సంతకాలు తీసుకున్నారు. చికోటి ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంత మందికి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. మరి రెండో రోజు జరిగే విచారణలో చికోటి ఎలాంటి విషయాలు వెల్లడిస్తారో చూడాలి.