
- నిర్మల్‌జిల్లా కొరిటికల్‌లో
- ఆలస్యంగా వెలుగులోకి.. ఇన్చార్జి హెచ్ఎం సస్పెన్షన్
లక్ష్మణచాంద(మామడ), వెలుగు : నిర్మల్ జిల్లా మామడ మండలంలో దారుణం జరిగింది. స్కూల్లో వేడి చేసిన రాగి జావ పాత్రలో పడి ఓ చిన్నారి చనిపోయింది. కొరిటికల్ గ్రామానికి చెందిన కొండ్ర అశోక్, శిరీష దంపతుల కూతురు ప్రజ్ఞ(6) స్థానిక ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ఒకటో తరగతి చదువుతోంది. స్కూల్లో విద్యార్థులకు టిఫిన్ పెట్టేందుకు శనివారం వేడివేడిగా రాగి జావ సిద్ధంచేశారు. జావ కోసం పిల్లలు క్యూలో నిలబడగా, ముందు నిల్చున్న ప్రజ్ఞ ప్రమాదవశాత్తూ ఆ పాత్రలో పడిపోయింది. గమనించిన టీచర్లు వెంటనే బయటకు తీసి నిర్మల్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. వేడికి వీపు భాగం కాలిపోయి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ దవాఖానకు తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందింది.
ఇన్చార్జ్ హెచ్ఎం సస్పెన్షన్
ఘటనకు బాధ్యురాలిని చేస్తూ ఇన్చార్జ్ హెచ్ఎం రమను సస్పెండ్ చేయగా, మిగతా ముగ్గురు టీచర్లకు డీఈవో ఎ.రవీందర్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్న భోజన సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని గుర్తించి ఏజెన్సీని రద్దు చేసి సిబ్బందిని తొలగించారు.