నిర్మల్, వెలుగు: నిర్మల్ గ్రామీణ మండలం ఎల్లపల్లిలో జరిగే ఓ బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. గ్రామంలో బాల్య వివాహం జరుతోందన్న సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి, సమయానికి చేరుకొని ఈ వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. బాల్య వివాహ నిరోధక చట్టం-2006 ప్రకారం18 ఏళ్ల లోపు బాలికలకు, 21 ఏళ్ల లోపు బాలురకు వివాహం చేయడం నేరమని తెలియజేశారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. పిల్లల భవిష్యత్తు కోసం వారి విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 1098కు సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లా బాలల సంరక్షణ అధికారిణి దేవి, మురళి, సూపర్వైజర్ మంగళ, సమన్వయకర్తలు గంగాధర్, సుప్రియ, శ్రీదేవి, పద్మావతి, తదితరులున్నారు.

