మన్యంలో ఆగని బాల్యవివాహాలు

మన్యంలో ఆగని బాల్యవివాహాలు
  • ఫేక్​ డేట్​ ఆఫ్​ బర్త్​  సర్టిఫికెట్లతో అనుమతులు
  • గుట్టు చప్పుడు కాకుండా పిల్లలకు పెండ్లిళ్లు

భద్రాచలం,వెలుగు: భద్రాద్రికొత్తగూడెంలో బాల్యవివాహాలు పెరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా పిల్లలకు పెండ్లి చేస్తున్నారు.  అయితే ఇప్పటి వరకూ చాలామంది  అధార్​ కార్డుల్లో ఏజ్​ మార్చి పెండ్లిళ్లు చేస్తున్నట్టు వెలుగులోకి వస్తున్నాయి. 2019లో 48, 2020 లో22,   2021లో 17, 2022 మే నెల వరకు 37 పెండ్లిళ్లను ఆఫీసర్లు అడ్డుకున్నారు. ఈ ఏడాది మే నెలలోనే 20కి పైగా బాల్యవివాహాలను అడ్డుకున్నారు. తెలియకుండా జరుగుతున్న పెండ్లిళ్లు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటున్నాయి.

పేదరికం, ఆడ పిల్లలను భారంగా భావించడం, పెద్దల నిరక్షరాస్యత వల్ల బాల్య వివాహాలు పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఏజెన్సి ఏరియాలో  పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో  ఎక్కువ మంది తల్లిదండ్రులు పిల్లలకు వివాహాలు చేస్తున్నారు. స్కూళ్లలో డ్రాపౌట్స్ పెరగడం కూడా మరో ప్రధాన కారణం. తాజాగా భద్రాచలం టౌన్​లో చర్ల రోడ్డులో బుధవారం ఓ బాల్య వివాహాన్ని ఆఫీసర్లు అడ్డుకున్నారు.  9వ తరగతిలోనే చదువు మానేసిన  ఆమ్మాయికి  తల్లిదండ్రులు లేకపోవడం వల్ల నానమ్మ ఆమెకు పెండ్లి చేసేందుకు సిద్ధమైంది. ఇలా జిల్లాలో రోజూ బాల్య వివాహాలు వెలుగుచూస్తున్నాయి.  తల్లితండ్రుల్లో అభద్రతాభావం వల్ల  ఏజెన్సీ ఏరియాలో పిల్లలకు పెండ్లి చేస్తున్నట్టు తెలుస్తోంది.  ఇటీవల కాలంలో  స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఎక్కువ రావడంతో  పిల్లలు ప్రేమ పేరుతో బయటకు వెళ్తున్నారని,సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితులు కల్పిస్తున్నారని తల్లిదండ్రులు భావించివయస్సును చూడకుండా పెండ్లిళ్లు చేస్తున్నారు  తల్లిదండ్రుల మధ్య గొడవలు, తండ్రి మద్యానికి బానిసకావడం, ఇలాంటి కారణంతో పిల్లలు బంధువుల దగ్గర పెరగడం .. ఆ పిల్లల భారం తగ్గించుకొనేందుకు వాళ్లు వివాహాలు చేయడం సాధారణంగా మారింది.అలాగే  పిల్లలను పోషించే స్థోమత లేకపోవడంతో,కుటుంబంలో నిరక్షరాస్యత వల్ల బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 

ఫేక్​ డేట్​ ఆఫ్​ బర్త్​  సర్టిఫికెట్లతో..
అయితే ఆధార్​ కార్డుల్లో పుట్టిన తేదీ  మార్చి ఆఫీసర్ల అనుమతితోనే   వివాహాలు  జరుగుతున్నాయి. ‘బాల్యవివాహం ఎలా చేస్తున్నార’ని ప్రశ్నిస్తే  అనుమతి పత్రం చూపుతున్నారు.ఇలాంటి పెండ్లిళ్లపై సర్పంచి,పంచాయతీ కార్యదర్శి,అంగన్‍వాడీ టీచర్‍, ఆయాలకు తెలుస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.  మరోవైపు ఆఫీసర్లు ఫీల్డ్ లెవెల్​ కి వెళ్లకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. బాలల కోసం ఏర్పాటు చేసిన బాలరక్ష వాహనం అడ్రస్​ కూడా లేదు. ఈ వాహనం జిల్లాలో ఎక్కడైనా బాల,బాలికలు ఇబ్బందులకు గురైతే వారిని తీసుకురావడానికి ఉపయోగించాలి. కానీ, చేయడం లేదు.  

భద్రాచలంలో 21 మే 2021 రాత్రి 11 గంటలకు ఓ కాలనీలో బాల్య వివాహం జరుగుతోందని ఆఫీసర్లకు సమాచారం అందింది. తహసీల్దారు, సీఐ, సీడీపీవో అంతా అక్కడికి వెళ్లారు. అయితే అమ్మాయికి18 సంవత్సరాలు నిండాయని  పుట్టిన తేదీని మార్చిన ఆధార్​కార్డ్​  చూపించారు.  అనుమానంతో స్టడీ సర్టిఫికేట్లు చూస్తే 16 ఏండ్ల వయస్సే ఉంది. ఉదయం 4 గంటలకు పెండ్లి అనగా ఆ వివాహాన్ని ఆఫీసర్లు అడ్డుకున్నారు. ”

అశ్వాపురం మండలంలోని ఓ గ్రామంలో ఇలాంటి ఓ పెండ్లి చేయడానికి పెద్దలు రెడీ అయ్యారు. సమాచారం అందుకున్న ఆఫీసర్లు వెళ్లి చూస్తే అమ్మాయికి 17 ఏండ్లే. తెలిసీ తెలియని తనంతో ఆ అమ్మాయి పెండ్లికి రెఢీ అయినట్టు తేలింది. 

దుమ్ముగూడెం మండలంలోని ఓ కుగ్రామంలో మణుగూరుకు చెందిన మైనర్‍బాలిక తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. కుటుంబ పెద్దలు ఆమెకు పెండ్లిచూపులు అరేంజ్​ చేశారు. విషయం తెలుసుకున్న సీడీపీవో అక్కడకు చేరుకుని అమ్మాయి మైనర్​ అని పెద్దలకు కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లిని అడ్డుకున్నారు.