
మీ వల్లే మా అమ్మాయి చనిపోయింది.. మీ నిర్లక్ష్యం వల్లే నా పాప నాకు దూరం అయ్యింది అంటూ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు చిన్నారి మౌనిక తల్లిదండ్రులు. ఏప్రిల్ 29వ తేదీ శనివారం ఉదయం పాల ప్యాకెట్ కోసం బయటకు వెళ్లిన చిన్నారి.. జీవచ్ఛవంగా ఇంటికి తిరిగి రావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆ పేరంట్స్. మౌనిక ఇంటికి వచ్చిన నివాళులర్పించిన మంత్రి తలసానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందంటూ మంత్రిపై మండిపడ్డారు.
మౌనిక ఘటనపై స్పందించారు మంత్రి తలసాని. ఈ ఘటనపై ఉన్నతాధికారులతో విచారణ చేయిస్తామన్నారాయన. ఈ ఘటన దురదృష్టకరం అని.. ఇలాంటివి మళ్లీ జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉంటే కఠినంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి తలసాని.
మౌనిక ఘటనలో.. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం ఉందని.. వాళ్లే కారణం అంటూ హైకోర్టుకు లేఖ రాశారు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్. జీహెచ్ఎంసీపై చర్యలు తీసుకోవాలని.. బాధ్యులను కఠినంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని.. హైకోర్టు స్పందించటం ద్వారా బాధిత కుటుంబానికి మరింత న్యాయం జరుగుతుందంటూ లేఖలో స్పష్టం చేశారాయన.