పురిటి నొప్పులతో అప్పుడు.. పుట్టిన బిడ్డతో ఇప్పుడు

పురిటి నొప్పులతో అప్పుడు.. పుట్టిన బిడ్డతో ఇప్పుడు
  •    వాగు దాటలేక బాలింత బాధలు
  •     చేతులపై మోసుకెళ్లిన కుటుంబసభ్యులు

గుండాల, వెలుగు: ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో చేతులపై మోసుకెళ్తున్న బాలింత పేరు కల్తి నిర్మల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం కన్నాయిగూడెం. సోమవారం తెల్లవారుజామునే బిడ్డకు జన్మనిచ్చిన గంటల వ్యవధిలోనే ఇలా అవస్థలు పడుతూ కుటుంబ సభ్యులు వాగుదాటించారు. అంతకుముందు రోజు అర్ధరాత్రి కూడా పురిటి నొప్పులతో తీవ్రవేదన పడుతున్న ఆమెను ఇలాగే వాగు దాటించి దవాఖానాకు చేర్చారు. నిండు గర్భిణి అయిన నిర్మలకు ఆదివారం అర్ధరాత్రి నొప్పులు రావడంతో ఎడ్లబండిపై దవాఖానాకు బయల్దేరారు. వర్షాలకు మార్గమధ్యంలో మల్లన్న వాగు పొంగి ప్రవహిస్తుండడంతో ఆమెను ఎలా దాటించాలో అర్థంకాక  చాలాసేపు ఇబ్బంది పడ్డారు. మరోవైపు ఆమె నొప్పులు తట్టుకోలేక తీవ్ర వేదన పడుతుండడంతో అప్పటికే వచ్చి అవతలి ఓడ్డున ఉన్న 108 సిబ్బంది సహాయంతో ఇలా భుజాలపై వాగు దాటించారు. స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. సోమవారం తెల్లవారుజామున ఆమె పండంటి పాపకు జన్మనిచ్చింది. తిరుగు ప్రయాణంలోనూ వాగు ఉధృతి తగ్గకపోవడంతో మళ్లీ భుజాలపై మోస్తూ అవతలి ఒడ్డుకు తీసుకెళ్లారు.