15 నుంచి 18లోపు వయసు వారికి జనవరి 1 నుంచి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ 

15 నుంచి 18లోపు వయసు వారికి జనవరి 1 నుంచి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ 

ఢిల్లీ : దేశంలో 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్ ప్రారంభించనున్నట్లు  ప్రకటించింది. ఆధార్ ఇతర ధ్రువ పత్రాలు లేని పిల్లలు స్కూల్ ఐడీ కార్డులను ఉపయోగించి పేరు నమోదు చేసుకునే వెసలుబాటు కల్పించినట్లు కోవిన్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ ప్రకటించారు. ఈ మేరకు కోవిన్ యాప్, వెబ్ సైట్లలో మార్పులు చేసినట్లు చెప్పారు. రిజిస్టర్ చేసుకున్న పిల్లలకు జనవరి 3వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పిల్లలకు భారత్ బయోటెక్ అందుబాటులోకి తెచ్చిన కోవాగ్జిన్ లేదా జైడస్ క్యాడిలాకు చెందిన జైకోవ్ డీ వ్యాక్సిన్ లలో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం కల్పించారు. 
హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు బూస్టర్ డోస్ ఇచ్చే అంశంపైనా కేంద్రం స్పష్టతనిచ్చింది. 9 నెలలకు ముందు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది. దేశంలో ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 3 నుంచి 15 నుంచి 18ఏళ్లలోపు వారికి టీకా ఇవ్వనున్నట్లు ప్రధాని మోడీ గతవారం ప్రకటించారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పకుండా మాస్కులు ధరించాలని కోరారు.