
ఆడుతూ పాడుతూ గడపాల్సిన ఆ చిన్నారులు డయాలసిస్ తో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే రెండు కిడ్నీలు పాడై నానా అవస్థలు పడుతున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన సాహితి, సాయి నితేష్ వీరిద్దరూ అక్కా..తముళ్లు డయాలసిస్ తో బాధపడుతున్నారు. పుట్టినప్పుడు హెల్తీగానే పుట్టినా.. మూడేళ్ల క్రితం థైరాయిడ్ వచ్చింది. తర్వాత నెమ్మదిగా చూపుతో పాటు.. వినికిడి శక్తి తగ్గింది. ఆరోగ్యం బాగా క్షీణించడంతో… చిల్డ్రన్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. దీంతో ఇద్దరికీ కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పారు డాక్టర్లు.
కొన్ని నెలల పాటు.. మెడిసిన్ తో ట్రీట్మెంట్ ఇచ్చారు నిమ్స్ డాక్టర్లు. ఏడాదిన్నర నుంచి సాహితి, నితేష్ .. డయాలసిస్ మీదే బతుకుతున్నారు. సాహితికి రోజుకి ఐదు డయాలసిస్ బ్యాగులు, నితేష్ కు మూడు కిట్స్ పడుతున్నాయి. ఇవి కాకుండా… ప్రతి రోజూ ఆరేడు రకాల మెడిసిన్ తోపాటు.. బ్లడ్ ఇంజక్షన్స్ తీసుకుంటున్నారు. నితీష్ ది చిన్న వయసు కావటంతో.. ఆర్గాన్స్ ఎదుగుదలకు మెడిసిన్ ఇస్తున్నారు.
పిల్లలకు నిమ్స్ లో ట్రీట్మెంట్ ఇస్తుండటంతో.. ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనని.. నల్గొండ నుంచి వచ్చి హైదరాబాద్ లో అద్దెకు ఉంటున్నాడు తండ్రి నర్సిరెడ్డి. ఓవైపు పిల్లల ఆరోగ్యం బాగోక బాధపడుతుంటే.. చిన్న పిల్లలు ఇన్ని మెడిసిన్స్ ఎందుకు వాడుతున్నారు? ఈ వయసులో డయాలసిస్ ఏంటి? అని.. ఇల్లు కాళీ చేయమన్నారు ఓనర్లు. ఇలా ఐదారు ఇండ్లు మారారు. ప్రస్తుతం తెలిసిన వాళ్ల ఇంట్లో ఉంటున్నారు.CMR ఫండ్ కాకుండా ఇప్పటికే 10 లక్షల వరకూ ఖర్చు చేశానంటున్నాడు చిన్నారుల తండ్రి నర్సిరెడ్డి. ఇద్దరికీ నెలకు 60 వేల వరకూ ఖర్చవుతుందంటున్నాడు. పేద కుటుంబం కావడంతో.. అంత ఖర్చు పెట్టే స్తోమత తమకు లేదని వాపోతున్నాడు.
రెండు కిడ్నీలు చెడిపోవటంతో.. ట్రాన్స్ ప్లాంటేషన్ ఒక్కటే మార్గమంటున్నారు డాక్టర్లు. జీవన్ ధాన్ లో సాహితి పేరు రిజిస్టర్ చేసి ఏడాదైంది. యంగ్ ఏజ్ లో బ్రెయిన్ డెడ్ అయిన వారి కిడ్నీలే సాహితికి.. మ్యాచ్ అవుతాయంటున్నారు డాక్టర్లు. జీవన్ ధాన్ వెయిటింగ్ లిస్ట్ ప్రకారం.. దాత దొరికేందుకు రెండు మూడేళ్లు వెయిట్ చేయాలంటున్నారు. పేదవారు కావటంతో నెలనెలా అయ్యే ఖర్చును తట్టుకోవడం కష్టమే అంటున్నారు.తమ పిల్లలను ఆదుకోవాలని కోరుతున్నారు చిన్నారుల కుటుంబ సభ్యులు. దాతలు ముందుకొచ్చి ఆర్థికంగా సాయం చేయాలని అర్థిస్తున్నారు.
ఎవరైనా ఆర్థిక సాయం చేయాలనుకున్నవారు 9502821678 (నర్సిరెడ్డి) నంబర్ కు ఫోన్ చేయగలరు.