Childrens story: నియమంగా ఉంటే చాలు.. అప్పుడే మనకు ఆహారం లభిస్తుంది.. కోతి–కుందేలు కథ

Childrens story: నియమంగా ఉంటే చాలు.. అప్పుడే మనకు ఆహారం లభిస్తుంది.. కోతి–కుందేలు కథ

 
ఒక అడవిలో పెద్ద మామిడి చెట్టు కింద దిగాలుగా కూర్చుంది కోతి. దాన్ని చూసి అటుగా వెళ్తున్న కుందేలు ‘‘ఏమైంది మిత్రమా, ఎందుకు అలా దీనంగా కూర్చున్నావు?” అని అడిగింది.‘‘మిత్రమా.. కుందేలు ఈ రోజు నాకు ఆహారం దొరక్కపోవడంతో ఏమీ తినలేదు. ఓపిక లేక నీరసంగా ఉండడంతో ఎక్కడికీ వెళ్లలేక ఇలా కూర్చున్నా” అంది కోతి.  

‘‘ఇంత పెద్ద అడవిలో ఎంత ఎత్తు చెట్టునైనా సునాయాసంగా ఎక్కేస్తావు. అలాంటి నీకే ఆహారం దొరకలేదంటే చాలా ఆశ్చర్యంగా ఉందే?’’ అన్నది కుందేలు. అందుకు కోతి ‘‘లేదు మిత్రమా! అడవిలో ఆహారానికి వచ్చిన కొరత ఏమీ లేదు. కానీ నేను ఏ ఒక్క చెట్టు నుంచి కూడా ప్రత్యక్షంగా పండ్లను కోయకూడదని నిర్ణయించుకుని కేవలం చెట్లు రాల్చిన పండ్లను మాత్రమే తీసుకోవాలని నియమం పెట్టుకున్నాను. అందువల్ల ఈ రోజు నేను వచ్చిన దారిలో ఏ చెట్టు దగ్గర పండ్లు రాలి పడి ఉండలేదు. అందుకే ఆహారం తినలేదు’’ అన్నది.

 ‘‘మిత్రమా.. ఎందుకని ఈ విధంగా నియమం పెట్టుకున్నావు? ఇలా అయితే నీకు ఆహారం దొరికినట్టే’’ అన్నది.‘‘మిత్రమా.. మనకు దెబ్బ తగిలితే ఎలా నొప్పితో బాధపడతామో.. చెట్లు కూడా అంతే. నిజానికి ఆ పండ్లు దాని ఆహారం అది దానికి అవసరమైనప్పుడు వాడుకుంటుంది. లేనప్పుడు లేదా పండిపోయినప్పుడు వాటంతట అవే రాలిపోతాయి. మన ప్రమేయం లేకుండా కూడా ఒక్కొక్కసారి బలమైన గాలులు వీయడం వల్ల అవి రాలిపడతాయి. అప్పుడు మాత్రమే వాటిని తీసుకుని తినాలి’’ అన్నది.

‘‘అయ్యో కోతి బావ ఇలాంటి నియమాలు పెట్టుకుంటే ఈ అడవిలో జంతువులకు ఆహారం దొరికినట్టే’’ అన్నది. ఈ మాటలు వింటూ ఆ జంతువుల వెనకే ఉన్న మామిడి చెట్టు ఆనందంతో మురిసిపోయింది. ‘‘జంతువులలో కూడా మా బాధను అర్థం చేసుకు నే జంతువులు ఉన్నాయా?’’ అనుకుని మనసులో కోతికి కృతజ్ఞతలు తెలుపుతూ, సంతోషంతో తన చెట్టు కొమ్మలను ఊపి కొన్ని కాయలను రాల్చింది. 

అది చూసిన కుందేలు ఆశ్చర్యపోతూ ‘‘ఇప్పుడు గాలి వేయలేదు. కానీ చెట్టు తనంతట తాను కొమ్మలను ఊపి కాయలను భలే రాల్చిందే?’’ అని.. ‘‘కోతి మిత్రమా నువ్వు చెప్పింది నిజమే. మనం ఇతరులకు మేలుచేయకపోయినా తెలిసి.. తెలిసి హాని చేయనంతవరకు మనకు ఏదో ఒక రూపంలో మంచి జరుగుతూనే ఉంటుంది’’ అంది. ఆ తర్వాత అవి కిందపడిన మామిడికాయలు తిని ఆనందంగా ఇంటిదారి పట్టారు.

  -ఏడుకొండలు కళ్లేపల్లి -

మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు
featureseditor@v6velugu.com కి మెయిల్​ చేయండి.