
- జగిత్యాల జిల్లాలో 1,880 ఎకరాల్లో మిర్చి సాగు
- ఫిబ్రవరిలో చేతికి రావాల్సిన పంట
- ముడత తెగులుతో 800 ఎకరాల్లో నష్టం
- కాత లేక జీవాలకు పంటను వదిలేస్తున్న రైతులు
జగిత్యాల, వెలుగు : ఈ ఏడాది ఫిబ్రవరిలో చేతికి రావాల్సిన మిర్చి పంటకు ముడత తెగులు సోకడంతో ఇప్పటికీ పూతకూడా రాలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొంది. చివరకు మిర్చీ తోటల్లో మేత మేసేందుకు మందలను వదిలేస్తున్నారు. గడ్డి దొరక్క అడవులకు వెళ్తున్న జీవాలు కనీసం ఆకులైనా తిని అకలి తీర్చుకుంటాయని గొర్రెల కాపరులకు చేన్లను అప్పగిస్తున్నారు.
800 ఎకరాలకు పైగా నష్టం..
జగిత్యాల జిల్లాలో 2021–22 లో 2,048 ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. మిర్చి రకాన్ని బట్టి పంట ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. ఈ మేరకు క్వింటాలుకు రూ.25 వేలు ప్రారంభమైన ధర రూ.32 వేల వరకు పలికింది. 2022–23 పంటలో 1,880 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. ఇప్పటికి సుమారు 800 ఎకరాలకుపైగా పంట పూర్తిగా నష్టపోగా మిగిలిన వెయ్యి ఎకరాల్లో దిగుబడి సగానికి పైగా పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘పెట్టుబడి’ నష్టమే..
ఒక్కో మొక్క రూ.2 చొప్పున ఎకరా నారు కొనుగోలుకు రూ.16 వేలకు తగ్గకుండా ఖర్చవుతోంది. అంతకుముందు పొలాన్ని సాగుకు సిద్ధం చేసుకునేందుకు సేద్యం ఖర్చులు, ఎరువులు, కూలీల ఖర్చుల కింద ఎకరానికి రూ.50 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. మొక్క నాటిన నెల రోజుల వరకు పంట బాగానే ఉన్నా తెగులు సోకడంతో చెట్టు పెరుగుదల నిలిచిపోయి పూత, పిందె, కాయ రావడంలేదని, ఒక్కో చెట్టుకు 5 కాయలకు మించి ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం
చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం ఈదుల లింగపేట గ్రామానికి చెందిన ఎల్లాల లక్ష్మారెడ్డి తనకున్న రెండెకరాల భూమిలో కొన్నేళ్లుగా మిర్చి పంట సాగు చేస్తున్నాడు. రసాయనిక ఎరువుల కోసం రూ.50 వేలకుపైగా ఖర్చు చేశాడు. గతేడాది ఎకరాకు రూ.25 వేలకు పైగా లాభం తెచ్చిన మిర్చీ.. ఇపుడు తీవ్ర నష్టాలను మిగిల్చింది. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
జీవాలకు ఆహారంగా
కాత, పూత లేకపోవడంతో రైతులు గొర్రెలు, మేకలకు పంటను మేతగా వదిలేస్తున్నారు. రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ప్రభుత్వం పెట్టుబడైనా ఇచ్చి ఆదుకోవాలి.
- ఎగుర్ల బీరయ్య,
గొర్రెల కాపరి, భీమారం