మేమిద్దరం.. మాకు ముగ్గురు అంటున్న చైనా

మేమిద్దరం.. మాకు ముగ్గురు అంటున్న చైనా
  • జననాల సంఖ్య తగ్గడంతో సంచలన నిర్ణయం
  • ఒక్కరికే జన్మనివ్వాలన్న నిబంధనను 2016లో ఎత్తేసిన చైనా
  • ఇద్దరు పిల్లలు కనడానికి అనుమతిచ్చినా పెరగని జననాలు
  • 2021లో ముగ్గురు పిల్లలు కనడానికి అనుమతిస్తూ సంచలన నిర్ణయం

దేశంలో జననాల రేటు బాగా తగ్గిపోవడంతో చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దంపతులు ముగ్గురు పిల్లలు కనడానికి అనుమతించింది. చైనాలో దంపతులు పాపైనా.. బాబైనా ఒకరితోనే సరిపెట్టుకోవాలన్న కఠిన నిబంధనను దశాబ్దాలుగా అమలు చేసిన విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ నిబంధన అమలు చేయడంతో జననాలు-మరణాల మధ్య వ్యత్యాసం పెరిగిపోయింది. దేశంలో యువత సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ.. వృద్ధుల సంఖ్య పెరుగుతూ పోతోంది. దీంతో జరిగిన నష్టం పూడ్చుకోవడంపై ఆలస్యంగా నైనా కన్ను తెరచిన చైనా ఒకరినే కనాలనే చట్టంలో సవరణలు చేసింది. 
2016లో కొత్త సవరణల మేరకు దంపతులు ఇద్దరు పిల్లలు ఉండేందుకు అనుమతించారు. అయినా దేశంలో జననాల రేటు ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. జీవితంలో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో చాలా మంది పెళ్లి ఈడు దాటిపోయినా పెళ్లి చేసుకోవడం లేదు. ఆ తర్వాత పిల్లలు కనే విషయంలో ఆర్ధిక పరిస్తితులను దృష్టిలో పెట్టుకుని ఒకరు చాలు అనే భావనతో ఉంటున్నారు. దశాబ్దాలుగా ఒకరినే కనాలనే చట్టం అమలు చేయడంతో జనంలో ఈ భావన బాగా నాటుకుపోయింది. జనాభా తగ్గిపోతున్నందున జననాలు -మరణాల రేటును బ్యాలెన్స్ చేసేందుకు ఇద్దరు పిల్లలు కనొచ్చని చట్టాన్ని మార్పు చేశారు. అయినా పెద్దగా మార్పు రాలేదు. 
గత ఏడాది కరోనా సమయంలోనూ.. ఆ తర్వాత ఈ సంవత్సరంలోనూ జననాల రేటు ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. ఈనెల ఆరంభంలో ప్రభుత్వం ప్రకటించిన జననాల రేటు ఆందోళనకరంగా ఉన్నట్లు తేల్చింది. 2019 జనాభా లెక్కల సగటును పరిశీలిస్తే ప్రతి వెయ్యి మందికి 10.48 మంది మాత్రమే పిల్లలు జన్మనిస్తున్నట్లు నిర్దారణ అయింది. వన్-చైల్డ్ పాలసీని సడలించినప్పటికీ పెద్దగా మార్పు రాలేదు. అంటే 1949 నాటి జననాల సంఖ్యతో సమానం అన్నమాట. దాదాపు ఏడు దశాబ్దాల కనిష్టానికి జననాల రేటు పడిపోయింది. అంటే 70 సంవత్సరాల క్రితం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడినప్పటి నాటి స్థాయికి చైనా జనన రేటు కనిష్ట స్థాయికి పడిపోయింది. 1850 తరవాత అతి తక్కువ జననాల రేటు నమోదు అయినట్లు ఈ లెక్కల్లో తేలినట్లు చైనా వార్తా సంస్థ జిన్‌హువా పేర్కొంది. 
కరోనా నేపధ్యంలో 2020లో లెక్కలను పరిశీలిస్తే ఒక్కో మహిళకు సగటున 1.3 పిల్లలు మాత్రమే ఉన్నట్లు తేలింది. తాజాగా ఈ సంవత్సరం లెక్కలను 2021 ఏప్రిల్ లో వెల్లడించగా పెద్దగా మార్పు రాలేదు. దాదాపు ఐదేళ్లుగా జననాల రేటు తగ్గుతూపోతుండడంతో తీవ్రంగా ఆందోలన చెందుతున్న చైనా 2016లో ఇద్దరు పిల్లలు కనేందుకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసినా జననాల రేటులో పెద్దగా మార్పు సాధించలేకపోయింది. ఈ నేపధ్యంలో తాజాగా ముగ్గురు పిల్లలకు అనుమతించాలన్న ప్రతిపాదనకు దేశాధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ నేతృత్వంలో జరిగిన పార్టీ పొలిట్‌ బ్యూరో ఆమోదముద్ర వేసింది.