బ్రిడ్జి కట్టింది.. రోడ్డేస్తోంది

బ్రిడ్జి కట్టింది.. రోడ్డేస్తోంది

పాంగాంగ్ సో లేక్ వద్ద నిర్మిస్తున్న చైనా

న్యూఢిల్లీ : చైనా తన బుద్ధి మార్చుకోవడం లేదు. బార్డర్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతూనే ఉంది. పాంగాంగ్ సో సరస్సుపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేసిన చైనా.. ఇప్పుడు దానికి దగ్గర్లో రోడ్డు వేస్తోంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) విడుదల చేసిన శాటిలైట్ ఫొటోల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ ఫొటోలను ఆ కంపెనీకి చెందిన డామియన్ సైమన్ ట్విట్టర్​లో పోస్టు చేశారు. అయితే ఈ ఫొటోల రిజల్యూషన్ తక్కువగా ఉండడంతో రోడ్డు నిర్మాణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియడం లేదు. పోయినేడాది సెప్టెంబర్ లో పాంగాంగ్ సో సరస్సుపై ఖుర్నాక్ వద్ద బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టిన చైనా.. ఈ ఏడాది ఏప్రిల్​లో అది పూర్తిచేసింది. ఇప్పుడు బలగాలు తమ స్థావరాల నుంచి బ్రిడ్జి దగ్గరికి చేరుకునేందుకు వీలుగా రోడ్డు వేస్తోంది. ఈ బ్రిడ్జి ద్వారా ఖుర్నాక్ నుంచి సరస్సు దక్షిణ ఒడ్డుకు ఉన్న 180 కిలోమీటర్ల దూరం కాస్తా 50 కిలోమీటర్లకు తగ్గింది. 2020 ఆగస్టులో మన బలగాలు ఆకస్మిక ఆపరేషన్ చేపట్టి కీలక స్థానాలపై పట్టు సాధించాయి. ఇలాంటి ఆపరేషన్లను భవిష్యత్తులో ఎదుర్కొనేందుకు చైనా ఈ నిర్మాణాలు చేపడుతోంది. వీటి ద్వారా తమ బలగాలను వేగంగా తరలించే ఏర్పాట్లు చేస్తోంది. కాగా, చైనా బ్రిడ్జి నిర్మాణాన్ని కేంద్రం ఖండించింది. ఆక్రమిత ప్రాంతంలో అక్రమంగా కడుతోందని మండిపడింది.