టార్గెట్ మమతా బెనర్జీ.. బెంగాల్‌లో నిజమైన మార్పు రావాలన్న ప్రధాని మోడీ..

టార్గెట్ మమతా బెనర్జీ.. బెంగాల్‌లో నిజమైన మార్పు రావాలన్న ప్రధాని మోడీ..

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. మాల్దా వేదికగా శనివారం జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆమె వల్లనే బెంగాల్‌లో అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్రానికి ఇప్పుడు కావాల్సింది కేవలం మార్పు కాదు.. నిజమైన మార్పు అంటూ మోడీ పిలుపిచ్చారు. తూర్పు భారతదేశంలో ఇన్నాళ్లూ సాగుతున్న విభజన రాజకీయాలకు స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని వ్యాఖ్యానించారు.

ALSO READ : మగాళ్లకు ఫ్రీ బస్సు..

మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేస్తూ.. బీహార్, ఒడిశా, అస్సాం వంటి రాష్ట్రాలు ఇప్పటికే అరాచక శక్తుల కబంధ హస్తాల నుండి విముక్తి పొందాయని, ఇప్పుడు బెంగాల్ వంతు వచ్చిందని మోడీ అన్నారు. బెంగాల్ లో మార్పు అవసరమని.. బీజేపీ ప్రభుత్వం రావాలనే కొత్త నినాదాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లారు. బెంగాల్ ప్రజలు అభివృద్ధి కోసం తపిస్తున్నారని, వారి కళ్లలో మార్పు పట్ల ఉన్న నమ్మకం తనకు స్పష్టంగా కనిపిస్తోందంటూ తన ప్రసంగంలో అన్నారు ప్రధాని. ముఖ్యంగా జెన్-జీ తరం యువత బీజేపీపై ఉంచుతున్న నమ్మకాన్ని గురించి కూడా మాట్లాడారు.

ALSO READ : భారతీయ రైల్వే చరిత్రలో మరో నూతన అధ్యాయం

2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. తూర్పు భారతం.. అందునా పశ్చిమ బెంగాల్ అభివృద్ధి చెందడం అనివార్యమని మోడీ స్పష్టం చేశారు. మాల్దా ప్రాంతం బెంగాల్ వృద్ధికి కీలకమని చెబుతూనే.. గత ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి విషయంలో పక్కనపెట్టాయని ఆరోపించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన హౌరా-గువాహటి మధ్య నడిచే 'అమృత్ భారత్', 'వందే భారత్' స్లీపర్ రైళ్లను ప్రారంభించారు. 

ALSO READ : 6 నిమిషాల్లో ఇంటికొచ్చిన బ్లింకిట్ అంబులెన్స్..

మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే రాష్ట్రం వెనకబడిందని.. బీజేపీ అధికారంలోకి వస్తేనే శాంతి, భద్రతలు, పారిశ్రామికాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. 2011 నుంచి అధికారంలో ఉన్న మమతా ప్రభుత్వాన్ని ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో ఓడించాలనే నినాదంతో మోడీ ప్రసంగం జరిగింది బెంగాల్ పర్యటనలో.