చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదు

చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదు
  • పార్లమెంట్‌లో ప్రకటించిన కేంద్ర మంత్రి
  • సరిహద్దుల నిర్ణయానికి చైనా ఒప్పుకోవడం లేదని వెల్లడి

భారత్-చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్ లో మాట్లాడారు. చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదని, లద్దాఖ్‌లో 1962లో చైనా వేల కిలోమీటర్ల భూభాగం ఆక్రమించిందన్నారు. మొత్తం 90 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని మంత్రి అన్నారు. ప్రధాని మోదీ లద్దాఖ్‌ వెళ్లి సైనికులను కలిశారని, సరిహద్దుల నిర్ణయానికి చైనా ఒప్పుకోవడం లేదని అన్నారు. ఎల్‌ఏసీ విషయంలో రెండుదేశాల మధ్య వివాదాలు ఉన్నాయని, ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకునేందుకు ఎంతో ప్రయత్నించామ‌ని చెప్పారు. చైనాతో మేం స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నామ‌ని, సామరస్య చర్చలతోనే సరిహద్దు సమస్యలకు పరిష్కారమ‌ని అన్నారు.

చైనా దూకుడు చర్యలతో శాంతి ఒప్పందంపై తీవ్ర ప్రభావం చూపుతుంద‌న్నారు. సరిహద్దు సమస్య తేలేవరకు ఎల్‌ఏసీని గౌరవించాలన్న నిర్ణయాన్ని చైనా ఉల్లంఘిస్తోందన్నారు. మే నుంచి సరిహద్దుల్లో భారీగా ఆయుధాలు, సైన్యాన్ని మోహరిస్తోందని, భారత్ కూడా తగిన రీతిలో సైన్యాన్ని మోహరిస్తోందన్నారు. చైనా ఏకపక్ష చర్యలను భారత్‌ ఖండిస్తోందని చెప్పారు.

ఎల్‌ఏసీని రెండు దేశాలు గౌరవించాలని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. చైనా కదలికలను నిరంతరం గమనిస్తున్నామ‌ని, ఆగస్టులో భారత్‌ను రెచ్చగొట్టేందుకు చైనా ప్రయత్నించిందన్నారు. సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలకు చైనా పాల్పడిందన్నారు. భార‌త సైన్యం చైనా దుశ్చర్యలను సమర్థంగా తిప్పికొట్టిందని అన్నారు. సరిహద్దుల్లో బలగాలను మరింత పెంచామ‌ని, సరిహద్దుల్లో శాంతి నెలకొనేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామ‌ని, భారత్‌తో కలిసి నడవాలని చైనాను కోరుతున్నామ‌ని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.