భారతదేశంలో గడచిన కొన్నాళ్లుగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఒకపక్క పొల్యూషన్ సమస్యతో పాటు పెట్రోల్, డీజిల్ కార్లకు ఫ్యూయెల్ ఖర్చులు అధికంగా ఉండటంతో చాలా మంది ఈవీలను ఎంచుకుంటున్నారు. సాంప్రదాయ వాహనాల కంటే ఇవి కొంత ఇబ్బందులు, పరిమితులను కలిగి ఉన్నప్పటికీ వీటిలోనూ కొన్ని బెనిఫిట్స్, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉండటంతో ఇండియన్స్ ఈవీలకు జై కొడుతున్నారు.
అయితే ప్రస్తుతం భారత పాసింజర్ వాహన మార్కెట్లో స్వదేశీ కంపెనీలు చైనా కార్ కంపెనీలతో గట్టి పోటీనే చూస్తున్నాయి. దీంతో డబ్బులు ఫుల్లుగా ఉంటే చైనా కంపెనీలు గడచిన ఏడాదిన్నర కాలంలో తమ హవా పెంచుకుంటున్నాయి ఈవీ కార్ల సెగ్మెంట్లో. దీనికి తగినట్లుగానే షోరూం నెట్వర్క్ పెంచుకుంటున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమెుబైల్ డీలర్స్ అసోసియేషన్ రిపోర్ట్ ప్రకారం దేశంలో అమ్ముడుపోతున్న ప్రతి మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి చైనా కంపెనీవేనని వెల్లడైంది.
ప్రస్తుతం ఎంజీ మోటార్స్, బీవైడీ, వోల్వో కంపెనీలు ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో 33.3 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయితే 2020 సమయంలో ఈవీ కార్ల అమ్మకాల్లో 85 శాతం వాటాను ఒక్క టాటా మోటార్స్ చేతిలో ఉండి ఏకచత్రాధిపత్యం కొనసాగింది. ప్రస్తుతం పైన పేర్కొన్న కంపెనీలు తమ అమ్మకాలను భారీగా పెంచుకుంటూ పోతున్నాయి. 2025 జనవరి నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు గత ఏడాది కంటే 87 శాతం పెరిగి లక్ష 36వేల 610 యూనిట్లుగా ఉంది. వీటిలో చైనా కంపెనీల అమ్మకాల హవా ఎక్కువగా ఉందని తేలింది.
ఇటాలియన్, యూరోపియన్, అమెరికన్ వారసత్వ కంపెనీల సముదాయం అయిన కార్ల తయారీ సంస్థ స్టెల్లాంటిస్ తన లీప్‌మోటర్ బ్రాండ్ ద్వారా ఈవీ కార్లను భారత మార్కెట్లో విక్రయించటానికి సిద్ధమైంది. ముంబైకి చెందిన JSW, చైనాలోని మూడవ అతిపెద్ద ఆటోమేకర్ చెరీతో చేతులు కలిపి ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలకు ప్లాన్ చేసింది. ఇవి 2027 నాటికి రావొచ్చని తెలుస్తోంది. ఇందుకోసం రూ.26వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తేలింది. ఇదే క్రమంలో భారత్ చైనా సంబంధాలు ఇటీవలి మెరుగుపడటంతో.. అతిపెద్ద కార్ల తయారీ సంస్థ BYD దేశంలో కార్యకలాపాలను విస్తరించడానికి గ్రీన్ సిగ్నల్ పొందాలని చూస్తోంది. ఇది నెలకు 550 వరకు కార్లు అమ్ముతూ భారతదేశంలో 5వ అతిపెద్ద ఈవీ అమ్మకదారుగా కొనసాగుతోంది.
