బీజింగ్: తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయ నుంచి తమ సైన్యాలను వెనక్కి తీసుకోవడంలో ఇండో–చైనాలు సమర్థమైన చర్యలు చేపట్టాయని డ్రాగన్ తెలిపింది. దీంతో ఎల్‌వోసీ వెంబడి ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడిందని చైనా పేర్కొంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడానికి సైన్యాలను వెనక్కి తీసుకోవాలని ఇరు దేశాలు ఒప్పుకొని రెండ్రోజులు గడిచిన నేపథ్యంలో తాజా పరిస్థితిపై చైనా పైవిధంగా స్పందించింది.
బార్డర్ వద్ద పరిస్థితి స్థిరంగా, మెరుగ్గా ఉందని చైనా ఫారెన్ మినిస్ట్రీ ప్రతినిధి జావో లిజియాన్ చెప్పారు. కమాండర్ లెవల్ చర్చల తర్వాత దళాలను వెనక్కి తీసుకోవడంలో ఇండో–చైనాలు ప్రభావవంతంగా వ్యవహరించాయన్నారు. ఉద్రిక్తతలు తగ్గించడంతోపాటు దళాలను వెనక్కి రప్పించడం విషయంలో ఇండియా తమతో సంయుక్తంగా కలసి పని చేస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఇరు దేశాలు మిలిటరీ, దౌత్యపరమైన చర్చలు కొనసాగిస్తాయన్నారు.
