కొడుకు ప్రాణం కోసం.. ఇంట్లోనే ల్యాబ్

కొడుకు ప్రాణం కోసం.. ఇంట్లోనే ల్యాబ్

మెంకెస్‌‌ సిండ్రోమ్‌‌.. ఇది అరుదైన వ్యాధి. ఆ వ్యాధి సోకితే మూడేండ్లకు మించి బతకరు. లక్షమంది పిల్లల్లో ఒకరికి వస్తుంది. ఆ వ్యాధే వచ్చింది చైనాకు చెందిన హావోయాంగ్‌‌కి. వెంటనే ట్రీట్మెంట్‌‌ అందిస్తే కొన్ని రోజులైనా బతుకుతాడు. కానీ, చైనాలో దానికి సంబంధించి మందులు లేవు. వేరే దేశానికి తీసుకుపోవాలంటే కరోనా కారణంగా రాకపోకలు లేవు. ఏం చేయాలి? అని చూస్తూ ఊరుకోలేదు హావోయాంగ్‌‌ తండ్రి. తన కొడుకును బతికించుకోవాలని అనుకున్నాడు. ఇంట్లోనే మెడిసిన్‌‌ తయారుచేసే ల్యాబ్‌‌ను స్టార్ట్‌‌ చేశాడు. తన కొడుక్కి కావాల్సిన మందులు తయారు చేస్తున్నాడు. కొడుకు కోసం ఆరాట పడుతున్నాడు. 


చైనాలోని సౌత్‌‌ వెస్ట్రన్‌‌ కున్మింగ్‌‌కి చెందిన గ్జువీయ్‌‌ చిన్న ఆన్‌‌లైన్‌‌ బిజినెస్‌‌ చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు. పాపకు నాలుగేండ్లు. ఈ మధ్యే బాబు పుట్టాడు. కానీ, ఆ బాబుకి అరుదైన వ్యాధి సోకింది. అదే మెంకెస్‌‌ సిండ్రోమ్‌‌. ఆ సిండ్రోమ్‌‌ మెదడు, నాడీ వ్యవస్థ ఎదుగుదలను నియంత్రిస్తుంది. శరీరానికి కావాల్సిన కాపర్‌‌‌‌ అందకుండా చేసే జన్యుపరమైన వ్యాధి. దానికి సంబంధించిన మెడిసిన్‌‌, ట్రీట్మెంట్‌‌ చైనాలో ఎక్కడా లేదు. వేరే దేశాల నుంచి డాక్టర్లు, మెడిసిన్‌‌ తెప్పించుకోవాల్సిన పరిస్థితి లేదు. కరోనా కారణంగా చైనా బోర్డర్‌‌‌‌ మూసేశారు దాంతో రాకపోకలు బంద్‌‌ అయ్యాయి. ఎలాగైనా తన బాబుని బతికించుకోవాలని అనుకున్నాడు. మెన్కెస్‌‌ సిండ్రోమ్‌‌ గురించి రీసెర్చ్‌‌ మొదలుపెట్టాడు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌‌ మొత్తం ఇంగ్లీష్‌‌లో ఉంది. హైస్కూల్‌‌ వరకే చదివిన గ్జువీయ్‌‌కి అది అర్థం కాలేదు.  ట్రాన్స్‌‌లేటర్‌‌‌‌ సాయంతో దాని గురించి తెలుసుకున్నాడు. ఒకటికి పదిసార్లు చదివి, అర్థం చేసుకుని ఫార్మాసిస్ట్‌‌ అయిపోయాడు. ఆరు నెలలు కష్టపడి ఇంట్లోని జిమ్‌‌ రూమ్‌‌ని లాబొరేటరీగా మార్చాడు. కాపర్‌‌‌‌ హిస్టిడైన్‌‌ అవసరాన్ని తెలుసుకుని దాన్ని తయారు చేసేందుకు ఒక మెషిన్‌‌  కనిపెట్టాడు. ఆరు వారాల్లో మెడిసిన్‌‌ను తయారు చేశాడు. దాన్ని మొదట కుందేలుపైన, ఆ తర్వాత తనపైన ప్రయోగించుకున్నాడు.

“ అంతా బాగుంది అనుకున్న తర్వాత నా కొడుక్కి ఇచ్చాను. ఆ మందు వేసిన తర్వాత హావోయాంగ్‌‌కి టెస్టులు చేయగా రిపోర్ట్స్‌‌ నార్మల్‌‌గా వచ్చాయి.  నేను తయారు చేసిన మందు బాబు రోగాన్ని పూర్తిగా నయం చేయదు. కానీ, వ్యాధి లక్షణాలను కొంతమేర తగ్గిస్తుంది. నేను మందు తయారు చేయడం కరెక్ట్‌‌ కాదని చాలామంది నా ప్రయత్నాన్ని విమర్శించారు. కానీ, నా దగ్గర వేరే ఆప్షన్‌‌ లేదు. అందుకే ఈ స్టెప్‌‌ తీసుకున్నాను. ఆ జబ్బుతో బాధపడుతున్న పిల్లల పేరెంట్స్‌‌ చాలామంది నన్ను కలుస్తున్నారు ఇప్పుడు. కానీ, దాన్ని బయటికి ఇచ్చేందుకు నాకు పర్మిషన్ లేదు. అందుకే ఎవ్వరికీ ఇవ్వడం లేదు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది రాకుండా నేను దీనికి సంబంధించి కోర్స్‌‌ చేస్తాను. నా వంతుగా కొంద రికి సాయం చేస్తాను” అంటున్నాడు గ్జువీయ్‌‌.