చైనా మాంజాకు ఆరుగురు బలి

చైనా మాంజాకు ఆరుగురు బలి

న్యూఢిల్లీ :  మకర సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగరేసేందుకు ఉపయోగించిన నిషేధిత చైనీస్ మాంజా కారణంగా పలు కుటుంబాల్లో విషాదం అలముకుంది. వివిధ రాష్ట్రాల్లో చైనీస్ మాంజాతో గొంతులు కోసుకుపోయి ఆరుగురు బలైపోయారు. ఆది, సోమవారాల్లో గుజరాత్ లో నలుగురు, ముంబైలో ఒకరు, మధ్యప్రదేశ్ లో ఓ బాలుడు మాంజా మెడకు కోసుకుపోయి చనిపోయారు. వీరంతా బైకులపై వెళ్తుండగా.. మెడకు మాంజా చుట్టుకోవడంతోనే మృత్యువాతపడ్డారు.చాలా మంది గాయాలపాలయ్యారు. 

ఆదివారం గుజరాత్ లోని భావ్ నగర్ లో బైకుపై వెళ్తున్న లష్కర్ చౌహాన్ (48) అనే వ్యక్తి గొంతుకు మాంజా దారం తాకి కోసుకుపోవడంతో చనిపోయాడు. పంచమహల్ జిల్లాలో నాలుగేండ్ల తరుణ్ మచ్చి అనే బాలుడు తండ్రితో కలిసి బైకుపై వెళ్తుండగా ఇలాగే మాంజాతో గొంతు కోసుకుపోయి మృతిచెందాడు. వడోదర జిల్లాలో 20 ఏండ్ల అంకిత్ వసావ బైకుపై వెళ్తూండగా ఇలాగే చనిపోయాడు. సూరత్ లో ఓ వ్యక్తి తన భార్యతో కలిసి బైకుపై వెళ్తుండగా అతడి మెడకు మాంజా చుట్టుకుంది. దీంతో బైక్ కంట్రోల్ తప్పి వారిద్దరూ కిందపడగా, అతడి భార్య టీనా వసావ(45) తలకు తీవ్ర గాయమై చనిపోయింది. ముంబైలోనూ బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని కూడా చైనీస్ మాంజా చుట్టుకుని బలి తీసుకుంది.   

 ఇండోర్ లో హైవే దిగ్బంధం 

మధ్యప్రదేశ్ లోని ధార్ సిటీలో ఆదివారం సాయంత్రం స్నాక్స్ కొనుక్కునేందుకని తన తండ్రితో కలిసి బైకుపై వెళ్తున్న ఏడేండ్ల కనిష్క్ మృత్యువాతపడ్డాడు. మాంజా దారం కోసుకుపోయి అతడికి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆస్పత్రికి తరలించినా, డాక్టర్లు రక్తాన్ని ఆపలేకపోవడంతో అతడు మృతిచెందాడు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా సిన్నార్ వద్ద ఉత్తమ్ అవద్ (55) అనే రైతు ఆదివారం సాయంత్రం మార్కెట్లో కూరగాయలు కొనుక్కుని బైకుపై ఇంటికి వస్తుండగా మాంజాతో గొంతు తీవ్రంగా కోసుకుపోయింది. అతడికి 3 సెంటీమీటర్ల లోతున 20 సెంటీమీటర్ల పొడవున గాయం కావడంతో డాక్టర్లు నాలుగు గంటలపాటు శ్రమించి సర్జరీ చేశారు. అతడికి ఏకంగా150 కుట్లు పడ్డాయి. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.