- పంట నష్టంపై అసత్య ప్రచారం చేస్తున్నరు
- ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి
ముషీరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పంట నష్టంపై కేసీఆర్, హరీశ్‌రావు చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్ చిన్నారెడ్డి అన్నారు. వర్షాకాలంలో అనుకున్న స్థాయిలో వానలు పడకపోవడంతో నదుల్లో నీళ్లు పారడం లేదన్నారు. దీనితో బావులు, బోర్లు అడుగంటాయన్నారు. రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల వరకు పంటలు ఎండిపోతే కేసీఆర్, హరీశ్‌రావు దానిని పదింతలు పెంచి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారుల సంఘం చైర్మన్ బొమిరెడ్డి కృపాకర్‌రెడ్డి సన్మాన కార్యక్రమాన్ని ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా రైతుల్లో ఉందని, కానీ రాజకీయ నిరుద్యోగులైన కేసీఆర్, హరీశ్‌రావు ఎందుకు హంగామా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్, హరీశ్‌రావుకు వర్షాభావ పరిస్థితులను అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామన్నారు.
ఇందులో భాగంగా గ్రామస్థాయిలో విద్య, వైద్యం, విద్యుత్ సరఫరా, పాల ఉత్పత్తులు, వ్యవసాయం, నీటి సరఫరా, స్కిల్ డెవలప్‌మెంట్ వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్,మాజీ ఐఏఎస్ చిత్తరంజన్ బిశ్వాస్, వ్యవసాయ శాఖ ఉద్యోగులు, అధికారుల సంఘం నాయకులు వైద్యనాథ్, కృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, కృపాకర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.