Women's World Cup: చిన్నస్వామిలో వరల్డ్ కప్ మ్యాచ్‌లు లేవు.. వేరే స్టేడియానికి తరలించిన ఐసీసీ

Women's World Cup: చిన్నస్వామిలో వరల్డ్ కప్ మ్యాచ్‌లు లేవు.. వేరే స్టేడియానికి తరలించిన ఐసీసీ

సెప్టెంబట్ 30 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ వేదికలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ మెగా టోర్నీకి బెంగళూరులోని ఐకానిక్ ఎం. చిన్నస్వామి స్టేడియం ఆతిథ్య హక్కులను కోల్పోయింది. ఈ స్టేడియంలో మ్యాచ్ లు జరగవని ఐసీసీ శుక్రవారం (ఆగస్టు 22) కన్ఫర్మ్ చేసింది. 2025 జూన్ 4న చిన్నస్వామి స్టేడియంలో విషాదం చోటు చేసుకోవడమే ఇందుకు కారణం. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ విజయోత్సవ వేడుకల తర్వాత జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. 

32000 సీటింగ్ కెపాసిటీ ఉన్న చిన్నస్వామి స్టేడియంలో ఇకపై క్రికెట్ ఆడే సూచనలు కనిపించడం లేదు. ఇందులో భాగంగా ఈ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్ లు కూడా వేరే స్టేడియానికి మార్చారు. ఈ స్టేడియంలో జరగాల్సిన ఐదు మ్యాచ్‌లను ఇప్పుడు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంకు తరలించారు. షెడ్యూల్ ప్రకారం టోర్నమెంట్ తొలి మ్యాచ్ తో పాటు సెమీఫైనల్‌ జరగాల్సి ఉంది. "ఊహించని పరిస్థితుల కారణంగా షెడ్యూల్‌ను సర్దుబాటు చేసి వేదికను మార్చాల్సి వచ్చింది. అత్యుత్తమ మ్యాచ్ లను అందించగలిగే ఐదు ప్రపంచ స్థాయి వేడుకలు ఉండడం మాకు సంతోషంగా ఉంది".అని ఐసిసి చైర్మన్ జే షా అన్నారు.

ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ .. ఈ జట్లు వరల్డ్ కప్ కోసం పోటీ పడనున్నాయి. ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. సొంత దేశంలో టోర్నీ కావడంతో భారత్ హాట్ ఫేవరెట్. భారత్ చివరగా 2013లో ప్రపంచ్ కప్‎కు ఆతిథ్యం ఇవ్వగా.. ఈ టోర్నీలో ఇండియా ఉమెన్స్ టీమ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 2017లో లార్డ్స్‌లో జరిగిన ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడంతో వన్డే వరల్డ్ కప్ భారత మహిళలకు కలగానే మిగిలింది. ఈ సారి టోర్నీ భారత్‎లోనే జరుగుతుండటంతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. 

ALSO READ : మీ సెంట్రల్ కాంట్రాక్ట్‌లు మాకొద్దు..

మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీ 2025, సెప్టెంబర్ 30 నుంచి 2025 నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంకలోని ఐదు వేదికలలో హైబ్రిడ్ మోడ్‎లో జరగనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. భారత్‎లోని ముంబై, గౌహతి, ఇండోర్, విశాఖపట్నం స్టేడియాల్లో మ్యాచులు జరగనున్నాయి. పాకిస్తాన్ తమ మ్యాచ్‌లను శ్రీలంక కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడనుంది. భద్రతా కారణాల దృష్ట్యా పాక్ వెళ్లేందుకు భారత జట్టు నిరాకరించింది. దీంతో టోర్నీని హైబ్రిడ్ మోడ్‎లో నిర్వహించి.. భారత్ ఆడే మ్యాచులను దుబాయ్ వేదికగా నిర్వహించారు.