- మరో నలుగురు సబార్డినేట్లకు కూడా షాక్
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా పశుసంవర్ధక శాఖలో ప్రక్షాళన మొదలైంది. అవినీతి, అధికార దుర్వినియోగంపై ఏసీబీ విచారణ నేపథ్యంలో ఇన్‌చార్జి జేడీ శంకర్‌ను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన భార్య, చింతపల్లి వీఎల్‌వో విజయభారతి డిప్యుటేషన్‌ను రద్దు చేశారు. ఆమెతో పాటు మరో నలుగురు ఆఫీస్ సబార్డినేట్ల డిప్యుటేషన్లను రద్దు చేస్తూ జిల్లా ఇన్‌చార్జి వెటర్నరీ, యానిమల్ హజ్బెండరీ అధికారి యాకూబ్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
గత ఏడాదిన్నరగా జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న విజయభారతి భర్త అధికారాన్ని ఉపయోగించి శాఖపై పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే కొందరికి ఇష్టానుసారంగా డిప్యుటేషన్లు ఇచ్చినట్లు విమర్శలు వచ్చాయి. ఈ నెల 7న ఈ అంశంపై ‘వెలుగు’లో కథనం ప్రచురితమైన అనంతరం చర్యలు తీసుకున్నారు.
విజయభారతి వెంటనే చింతపల్లి సబ్‌సెంటర్‌లో రిపోర్ట్ చేసి విధుల్లో చేరాలని ఆదేశించారు. అలాగే ఎన్.అశోక్, కే.సోనేరావు, జి.నారాయణ, బి.అనురాధ డిప్యుటేషన్లను కూడా రద్దు చేసి, సంబంధిత సెంటర్లలో హాజరుకావాలని సూచించారు.
