Chiranjeevi: వ్యక్తిత్వ హక్కుల కోసం మెగాస్టార్ పోరాటం... డీప్‌ఫేక్‌లు, AI దుర్వినియోగంపై కోర్టు కీలక ఉత్తర్వులు!

Chiranjeevi: వ్యక్తిత్వ హక్కుల కోసం మెగాస్టార్ పోరాటం... డీప్‌ఫేక్‌లు, AI దుర్వినియోగంపై కోర్టు కీలక ఉత్తర్వులు!

ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు తీస్తోంది. ఇటీవల వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI ) సాంకేతికతతో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సృష్టిస్తున్నారు. అయితే దీనిని వాడే విధానంలోనే అనేక పెడదోరణులకు దారితీస్తోంది.  రాజకీయ, దేశ వ్యతిరేక, అశ్లీల కంటెంట్‌ను ప్రచారం చేయడానికి వాడేస్తున్నారు. దీనివల్ల జరిగే నష్టం పూడ్చలేనిది మారిపోయింది. దీని ప్రభావం ఏ ఒక్కరని వదలడం లేదు. AI ద్వారా మార్ఫింగ్ చేసిన చిత్రాలు, మీమ్‌లు, వీడియోలను కూడా ప్రచారం చేస్తున్నారని ఆరోపణులు వెల్లవెత్తుతున్నాయి.  సినీ సెలబ్రిటీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో వారు తమ వ్యక్తిత్వ హక్కులను కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు. 

వ్యక్తిత్వ హక్కుల కోసం కోర్టుకు చిరంజీవి..

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన వ్యక్తిత్వ హక్కులను కాపాడుకునేందుకు  హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. 30కి పైగా ఆన్‌లైన్ సంస్థలు, ఈ-కామర్స్ స్టోర్లు, యూట్యూబ్ ఛానెళ్లు, డిజిటల్ మీడియా వేదికలకు వ్యతిరేకంగాపిటిషన్ దాఖలు చేశారు. ఈ సంస్థలు తన అనుమతి లేకుండా వాణిజ్య, వ్యక్తిగత లాభాల కోసం తన వ్యక్తిత్వాన్ని వాడుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.

సెలబ్రిటీల ప్రతిష్టకు రక్షణగా ఉత్తర్వులు..

దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి ఎస్. శశిధర్ రెడ్డి సెప్టెంబర్ 26న కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై చిరంజీవి పేరు, ఫోటో, వాయిస్ లేదా ఆయన పోలికలను ఏ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనా, అదీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెటావర్స్ వంటి అధునాతన సాంకేతిక రూపాల్లో కూడా ఆయన అనుమతి లేకుండా వాడటం కుదరదని తేల్చి చెప్పారు.   తద్వారా, డీప్‌ఫేక్‌ల (Deepfakes) ద్వారా సెలబ్రిటీల ప్రతిష్టకు హాని కలిగించే ప్రమాదం నుండి రక్షణ కల్పించినట్లయింది.

►ALSO READ | Mythri vs Ilaiyaraaja: ‘మైత్రీ మేకర్స్’ని వదలని ఇళయరాజా.. ‘డ్యూడ్‌’పై లీగల్‌ చర్యలకు కోర్టు అనుమతి!

అనుమతి లేకుండా ఇలాంటి వాటిని వాడితే, ఆయా ఉత్పత్తులను లేదా ఆలోచనలను చిరంజీవి స్వయంగా ఆమోదించారని ప్రజలు తప్పుగా భావించే ప్రమాదం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. నకిలీ చిత్రాలు (Morphed Images) సృష్టించి వాటిని వాణిజ్య ప్రయోజనాలకు, లేదా రాజకీయ, దేశ వ్యతిరేక, అశ్లీల కంటెంట్‌ను ప్రచారం చేయడానికి వాడుతున్నారు. దీనివల్ల జరిగే నష్టం పూడ్చలేనిది  అని ఉత్తర్వులో కోర్టు స్పష్టం చేసింది.

డిజిటల్ కంటెంట్ వేగంగా వ్యాపిస్తుందనే కారణాన్ని పరిగణనలోకి తీసుకుని, కోర్టు చాలా మంది ప్రతివాదులకు ముందుగా నోటీసు ఇవ్వకుండానే ఈ మధ్యంతర ఉపశమనాన్ని మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 27వ తేదీకి వాయిదా వేసింది.  ఈ తీర్పు ఇతర ప్రముఖులకు కూడా వారి వ్యక్తిత్వ హక్కుల రక్షణకు ఒక చారిత్రాత్మక ఉదాహరణగా నిలవనుంది.