
సినీ చరిత్రలో దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా పేరు ఏంతో ప్రత్యేకం. దాదాపు 50 ఏళ్లుగా విజయవంతమైన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన తన పాటలపై ఎలా మనసుపెట్టి స్వరపరుస్తారో.. తనకు అన్యాయం జరిగితే కూడా అంతే స్థాయిలో విరుచుకుపడతారు. తన పాటల కాపీరైట్‌ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తు, చట్టపరమైన పోరాటం చేస్తూనే వస్తున్నారు. ఈ విషయం చాలా సార్లు రుజువైంది. తన పాటలకు ఉండే క్రేజీ అలాంటింది. అయితే, 1970, 1980, 1990ల నాటి తన పాటలను ఇప్పటికీ.. అంటే.. ఈ తరం మ్యూజిక్ డైరెక్టర్స్ అనుకరిస్తూ తమ సినిమాల్లో వాడేస్తున్నట్లుగా వైరల్ అవ్వడమే అందుకు నిదర్శనం!!
లేటెస్ట్ విషయానికి వస్తే..
ప్రదీప్ రంగనాధ్ నటించిన 'డ్యూడ్' మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది. ఈ సినిమాని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ స్వరాలు అందించారు. ఈ చిత్ర పాటలను ఆడియో సంస్థ సోనీ మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేశారు.
అయితే..'డ్యూడ్' మూవీలో తన అనుమతి లేకుండా తాను స్వరపరిచిన రెండు పాటలను వాడుకున్నారని ఆరోపిస్తూన్నారు ఇళయరాజా. ఈ క్రమంలో ఇళయరాజా.. .'డ్యూడ్' చిత్ర నిర్మాతలైన మైత్రి మేకర్స్, సోనీ మ్యూజిక్‌పై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయపరంగా ముందుకెళ్లేందుకు న్యాయస్థానం కూడా ఇళయరాజాకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో కేసు ఫైల్ చేయడానికి ఇళయరాజా రెడీ అయ్యారు. అయితే ఓ సన్నివేశంలో 'కరుత మచ్చన్' అనే తన పాటని వాడారని ఇళయరాజా రంగంలోకి దిగారు.
ఇప్పటికే, గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ పై ఇళయరాజా చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. నెట్ ఫ్లిక్స్ నుంచి కొన్ని రోజుల పాటు ఈ సినిమాని తొలగించాల్సి వచ్చింది. అలానే అదే మైత్రీ వాళ్ళు తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసిన 'మంజుమ్మల్ బాయ్స్' పైనా కేసు వేశారు. ఈ సినిమాలో 'గుణ' సాంగ్స్ వాడినందుకు.. చిత్ర నిర్మాతలు పరిహారం చెల్లించారు కూడా. ఇలా మైత్రి వాళ్లకు ఎప్పటికప్పుడు ఇళయరాజా కేసులు వేస్తున్నా.. అలానే తన పాటలను అనుకరించడం ఎందుకని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ సారి 'డ్యూడ్' విషయంలో మైత్రి వాళ్లపై ఇళయరాజా చేపట్టిన యుద్ధం ఎలా ముగుస్తుందో తెలియాల్సి ఉంది.