CMO కార్యాలయ క్యాంపస్‌లో క్లోరిన్ గ్యాస్ లీక్..

CMO కార్యాలయ క్యాంపస్‌లో క్లోరిన్ గ్యాస్ లీక్..

ఉత్తరప్రదేశ్‌ మధురలోని చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) కార్యాలయ క్యాంపస్‌లో శుక్రవారం (నవంబర్ 3వ తేదీన) క్లోరిన్ గ్యాస్ లీకైంది. దాదాపు 10 మంది నర్సింగ్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి డాక్టర్లు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

ఈ ఘటనపై మధుర సీఎంఓ డాక్టర్ అజయ్ కుమార్ స్పందించారు. ఎలాంటి నిర్లక్ష్యం లేదన్నారు. నిన్ననే గ్యాస్ వాసన వస్తే అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి.. చెక్ చేయించామన్నారు. గ్యాస్ వాసన రాకుండా వారు దాన్ని నియంత్రించారని తెలిపారు. అయితే... శుక్రవారం (నవంబర్ 3న) ఉదయం మళ్లీ గ్యాస్ వాసన వచ్చిందని, ఈ విషయంలో తాము ఎలాంటి నిర్లక్ష్యం వహించలేదని చెప్పారు. 

గ్యాస్ లీకైన సమయంలో కొందరు నర్సింగ్ విద్యార్థినీలు కింద కుప్పకూలిపోవడం కనిపించారు. మరికొందరు ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. కొందరు విద్యార్థినీలు.. టెన్షన్ తో వాంతులు చేసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన విద్యార్థినీలందరూ సేఫ్ గా ఉన్నారని తెలిపారు. 

మధురలోని చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ కార్యాలయంలోని క్యాంపస్‌లో క్లోరిన్‌ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. గురువారం (నవంబర్ 2న) సాయంత్రం ఒక సిలిండర్‌ నుంచి క్లోరిన్ గ్యాస్ లీక్‌ అయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తాత్కాలికంగా దానిని నియంత్రించారు.

మరోవైపు గురువారం సాయంత్రం నుంచి క్లోరిన్ గ్యాస్ లీక్‌ అవుతున్నప్పటికీ అధికారులు పెద్దగా పట్టించుకోలేదని కొందరు నర్సింగ్‌ విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నిర్లక్ష్యం వల్ల తాము అనారోగ్యం పాలయ్యామని కొందరు యువతులు ఆవేదన వ్యక్తం చేశారు.