విషాదంలో మునిగిపోయిన చౌటపల్లి

విషాదంలో మునిగిపోయిన చౌటపల్లి
  • నలుగురు అన్నదమ్ముల  మృతితో మిన్నంటిన రోదనలు
  • డెడ్​బాడీలపై పడి వెక్కి వెక్కి ఏడ్చిన భార్యాపిల్లలు
  • ముగిసిన అంత్యక్రియలు

హుస్నాబాద్​, వెలుగు : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి విషాదంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన అన్నదమ్ములు ఎరుకల కృష్ణ(47), సంజయ్​(43), సురేశ్​(38), శ్రీనివాస్​అలియాస్​ వాసు(36) బుధవారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. సూరత్​లో ఉంటున్న వారు తమ బంధువు కనకయ్య అంత్యక్రియలకు వచ్చి తిరిగి వెళ్తుండగా జరిగిన కారు ప్రమాదంలో చనిపోయారు. గురువారం వారి డెడ్​ బాడీలను గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. భార్యాపిల్లలకు జాగ్రత్తలు చెప్పి వెళ్లిన వారు విగతజీవులవడంతో బంధువులంతా గుండెలు బాదుకుంటూ రోదించారు. కృష్ణ కూతుళ్లు రమ్య, కావ్య 'డాడీ.. బాబాయ్​లూ.. మీరు లేకుండా మేమెట్లా బతకాలె’ అంటూ మృతదేహాలపై పడి రోదించగా గ్రామస్తులు కంటతడి పెట్టారు.

సంజయ్​ కొడుకులు ప్రభాస్, మోక్ష్​, సురేశ్​ కొడుకు భార్గవ్​, కూతురు వైష్ణవి, శ్రీనివాస్​ కూతుళ్లు ఖుషీ డెడ్​బాడీలపై పడి ఏడ్చారు. 'లేవండి డాడీ.. పెద్దడాడీ.. బాబాయ్​లూ.. మాతోని మాట్లాడుండ్రి’ అనడం గుండెలను పిండేసింది. పిల్లలంటే వాళ్లకు చాలా ఇష్టమని,  ఎప్పుడూ వారికి మంచి భవిష్యత్​ఇవ్వాలని కలలు కనేవారని మృతుల భార్యలు సుష్మ, శారద, సరిత, సంగీత కుమిలిపోయారు. మృతుల స్నేహితులు వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఊరి నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా బంధువులు, స్నేహితులు చివరిచూపుకు తరలివచ్చారు. ఎమ్మెల్యే వొడితల సతీశ్​కుమార్​, బీజేపీ నాయకుడు బొమ్మ శ్రీరామ్​వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు.