- డిప్యూటీ సీఎం, మంత్రుల సమక్షంలో ప్రకటన
జూబ్లీహిల్స్, వెలుగు: అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు సమానంగా అందుతున్నాయని చెప్పారు. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో శనివారం క్రైస్తవులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీలు విశ్వనాథ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా క్రైస్తవ నేతలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. క్రిస్టియన్లు అందరూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతు తెలపడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో క్రైస్తవులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో క్రిస్టియన్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్, దీపక్ జాన్ తదితరులు పాల్గొన్నారు.
