క్రీస్తు కాంక్షినట్టు ఉంటే యుద్ధాలు జర్గవు, జైళ్లు అవసరం లేదు:కేసీఆర్

క్రీస్తు కాంక్షినట్టు ఉంటే యుద్ధాలు జర్గవు, జైళ్లు అవసరం లేదు:కేసీఆర్

క్రీస్తు సూచనలు పాటిస్తే ఇతరుల పట్ల అసూయ, ద్వేషం ఉండవని అసలు యుద్దాలు జరగవని.. జైళ్ల అవసరం కూడా ఉండదని సీఎం కేసీఆర్ అన్నారు. తుది శ్వాస విడిచే వరకు వసుధైక కుటుంబంగా ఉండాలని కాంక్షించిన వ్యక్తి జీసస్ అని గుర్తు చేశారు. క్రీస్తు తర్వాత అనేక మంది స్వేచ్ఛ కోసం స్వతంత్రం కోసం ప్రయత్నం చేశారని చెప్పారు. క్రీస్తు మార్గంలో పయనించి.. విజయం సాదిద్దామని కోరుకుందామన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల నుండి వచ్చిన క్రైస్తవ పెద్దలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 

20 ఏళ్ల క్రితం దిక్కులేని స్థితిలో చిన్న బుచ్చుకొని కూర్చున్న స్థితిలో జై తెలంగాణ అంటూ ఉద్యమం స్టార్ట్ చేశామని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ సాధించాం.. ఇప్పుడు జై భారత్ అంటూ మళ్లీ పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. కులం జాతి వర్గం అని లేకుండా అన్ని పండుగలను ఘనంగా జరుపుకుంటున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఇది దేశానికి ఆదర్శమన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని.. కొత్త యుద్దానికి సమర శంఖం పూరించామని తెలిపారు. ప్రపంచంలోనే గొప్ప దేశంగా, శాంతికాముక దేశంగా భారత్ ను తీర్చిదిద్దాలన్నారు. క్రిస్టియన్ల కొన్ని సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. రాష్ట్ర, జాతీయ స్థాయి క్రిస్టియన్ మత పెద్దలతో త్వరలోనే ఒక  సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.