- హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ డాక్టర్ల రీసెర్చ్ లో వెల్లడి
- హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ డాక్టర్ల రీసెర్చ్‌లో వెల్లడి
- 150 మంది కిడ్నీ పేషెంట్లపై 18 నెలల పాటు పరిశోధన
- 67 శాతం మందికి రెటినోపతీ ఇష్యూ
- బీపీ, షుగర్ ఉన్న సీకేడీ రోగుల్లో సమస్య మరింత తీవ్రం
- కిడ్నీ పేషెంట్లు కంటి పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ల సూచన
హైదరాబాద్, వెలుగు: క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) కేవలం మూత్రపిండాలకే పరిమితం కాదని, అది కంటి చూపును సైతం తీవ్రంగా దెబ్బతీస్తుందని సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీ డాక్టర్లు చేసిన రీసెర్చ్ లో తేలింది. సీకేడీ రోగుల్లో చాలామందిలో కంటికి సంబంధించిన సమస్యలు, రెటీనాలో మార్పులు వస్తున్నాయని గుర్తించింది.
సీకేడీ వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ కంటి సమస్య మరింత తీవ్రమవుతుందని, అందుకే కిడ్నీ వ్యాధిగ్రస్తులు కంటి పరీక్షలు కూడా చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ ఎల్.రతన్ సింగ్, డాక్టర్ నవీన్ చంద్ర భండారీ, డాక్టర్ డి.రవిశంకర్ రావు నేతృత్వంలోని టీమ్ ఈ స్టడీ చేసింది. 18 నెలల పాటు 150 మంది సీకేడీ రోగులను డాక్టర్లు పరీక్షించారు.
వ్యాధి నిర్ధారణ అయిన వారి నుంచి, డయాలసిస్ చేయించుకుంటున్న వారి వరకు వివిధ స్టేజుల్లో ఉన్న రోగులను ఈ స్టడీలో చేర్చారు. ఫండస్ కెమెరా, ఇన్ డైరెక్ట్ ఆప్తాల్మోస్కోపీ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా వారి కంటి రెటీనాలో వస్తున్న మార్పులను రికార్డ్ చేశారు. ఫైనల్ గా సీకేడీ సమస్యలు ఉంటే.. కిడ్నీలు మాత్రమే దెబ్బతింటాయనుకుంటే పొరపాటేనని, కండ్లు కూడా దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు.
150 మందిపై 18 నెలల పాటు రీసెర్చ్
గాంధీ హాస్పిటల్ డాక్టర్ల టీం ఈ రీసెర్చ్ కోసం మొత్తం 150 మంది సీకేడీ రోగులను సెలెక్ట్ చేసుకున్నది. 18 నెలల పాటు సాగిన ఈ రీసెర్చ్ లో 20 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పైబడిన వారు, వ్యాధి తీవ్రత వేర్వేరు స్టేజుల్లో ఉన్నవారిని, డయాలసిస్ చేయించుకుంటున్న వారిని కూడా చేర్చారు. ఇందులో ఐదుగురు 20 నుంచి 30 ఏండ్ల వయసున్నవాళ్లు ఉన్నారు.
మొత్తం 150 మందిలో 105 మంది పురుషులు, 45 మంది మహిళలు ఉన్నారు. కిడ్నీ వ్యాధికి కారణమైన హైపర్ టెన్షన్ (బీపీ) పేషెంట్లు 88 మంది, డయాబెటీస్ (షుగర్) పేషెంట్లు 32 మంది, రెండూ ఉన్న పేషెంట్లు 30 మంది ఉన్నారు. వీరిని గ్రూపులుగా డివైడ్ చేశారు. ఫండస్ కెమెరా, ఇన్ డైరెక్ట్ ఆప్తాల్మోస్కోపీ వంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో ప్రతి ఒక్కరి కంటిలోని రెటీనా పొరను క్షుణ్ణంగా పరిశీలించి, అందులో జరుగుతున్న మార్పులను రికార్డ్ చేశారు.
100 మందికి రెటీనోపతి సమస్య
రీసెర్చ్ లో పాల్గొన్న 150 మందిలో కేవలం 50 మంది (33.33%) కండ్లు మాత్రమే నార్మల్ గా ఉన్నాయి. మిగిలిన 100 మందిలో (66.67%) రెటీనాలో స్పష్టమైన మార్పులు కనిపించాయి. ముఖ్యంగా... సీకేడీకి ప్రధాన కారణాలైన బీపీ, షుగర్ ఉన్నవారిలోనే ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు రీసెర్చ్ లో తేలింది. హైపర్ టెన్షన్ కారణంగా రెటీనా దెబ్బతినడాన్ని ‘హైపర్‌టెన్సివ్ రెటినోపతి’ అని అంటారు.
దీని ద్వారా ఏకంగా 47 మంది కంటి చూపు సమస్య ఎదుర్కొంటున్నట్లు స్టడీలో తేలింది. కంటి సమస్యలున్న ప్రతి ఇద్దరిలో ఒకరు బీపీ బాధితులే కావడం గమనార్హం. షుగర్ వల్ల రెటీనా దెబ్బతినడాన్ని ‘డయాబెటిక్ రెటినోపతి’ అని అంటారు. డయాబెటిక్ రెటినోపతీ బాధితులు 31 మంది ఉన్నట్లు గుర్తించారు. అలాగే, మరో 22 మందిలో బీపీ, షుగర్ రెండింటి కారణంగా మిక్స్డ్ రెటినోపతి లక్షణాలు కనిపించాయి. కిడ్నీ వ్యాధి వచ్చి రెండేండ్లు దాటిన 51- నుంచి 65 ఏండ్ల మధ్య వయసు వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు రీసెర్చ్ లో తేలింది.
నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు కోల్పోయే ప్రమాదం
రెటీనాలో కనిపించే మార్పులు.. కిడ్నీ వ్యాధి తీవ్రతను తెలియజేసే మిర్రర్ లా పనిచేస్తాయని డాక్టర్లు అంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ‘సీకేడీ కారణంగా కండ్లు కూడా దెబ్బతింటాయి. చాలామందికి చూపు మందగించే వరకు సమస్య ఉన్నట్లే తెల్వదు. అందుకే సీకేడీ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి’’ అని గాంధీ హాస్పిటల్ ఆఫ్తాల్మాలజీ డిపార్ట్మెంట్ హెచ్‌వోడీ డాక్టర్ రవి శేఖర్ రావు సూచించారు.
‘‘డయాబెటిస్, బీపీ.. కంటిని, కిడ్నీలను ఒకేసారి దెబ్బతీస్తాయి. షుగర్, బీపీని కంట్రోల్లో ఉంచుకుంటేనే కండ్లు, కిడ్నీలు సురక్షితంగా ఉంటాయి. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్న వారితో సహా, కిడ్నీ, బీపీ, షుగర్ సమస్య ఉన్న ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి”అని గాంధీ హాస్పిటల్ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ హెచ్‌వోడీ డాక్టర్ మంజూషా సూచించారు.
