ఫాల్కన్ స్కామ్‌‌‌‌ కేసులో కంపెనీ సీఈఓ యోగేంద్ర అరెస్ట్​

ఫాల్కన్ స్కామ్‌‌‌‌ కేసులో కంపెనీ సీఈఓ యోగేంద్ర అరెస్ట్​
  • అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు
  • వివరాలు వెల్లడించిన సీఐడీ డీజీ శిఖాగోయల్‌‌‌‌  

హైదరాబాద్, వెలుగు: ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అప్లికేషన్ స్కామ్‌‌‌‌ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అధిక వడ్డీ రేట్ల ఆశ చూపి వేలాది మంది డిపాజిటర్ల నుంచి సుమారు రూ.4,215 కోట్లు సేకరించి భారీ మోసానికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు, కంపెనీ సీఈఓ యోగేంద్ర సింగ్‌‌‌‌ను  సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి నుంచి పరారీలో ఉన్న యోగేంద్ర సింగ్​ను మంగళవారం మచ్చ బొల్లారంలో సీఐడీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. ఈ మేరకు సీఐడీ డీజీ శిఖాగోయల్‌‌‌‌ మంగళవారం వివరాలు వెల్లడించారు. www.falconsgroup.com వెబ్‌‌‌‌సైట్ ద్వారా, ఫాల్కన్ అప్లికేషన్‌‌‌‌ను అభివృద్ధి చేసి, అధిక వడ్డీలు ఇస్తామంటూ సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌ఫామ్​లు, టెలీకాలర్ల ద్వారా ప్రచారం చేశారు. 

తమకు ప్రముఖ ఎంఎన్‌‌‌‌సీలతో సంబంధం ఉన్నట్టు నకిలీ ఒప్పందాలు సృష్టించారు. ఇలా అధిక వడ్డీ రేట్ల పేరిట 7,056 మంది డిపాజిటర్ల నుంచి సుమారు రూ.4,215 కోట్లు సేకరించారు. ప్రాథమిక అంచనా ప్రకారం, 4,065 మంది డిపాజిటర్లు రూ.792 కోట్ల వరకు మోసపోయారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో మూడు కేసులు నమోదు చేశారు. ఈ కేసులు అనంతరం సీఐడీకి బదిలీ అయ్యాయి. ఈ కేసులో సీఈఓ యోగేంద్ర సింగ్‌‌‌‌తోపాటు మరో ప్రధాన నిందితుడు, కంపెనీ ఎండీగా వ్యవహరించిన అమర్ దీప్ కుమార్ ను సీఐడీ బృందం ఇటీవలే అరెస్టు చేసింది. తాజాగా సీఈఓ యోగేంద్ర సీఐడీకి చిక్కారు. ఈ కేసులో మిగిలిన నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.