వంకేశ్వరం గ్రామంలో డీసీసీబీలో అవినీతిపై ఎంక్వైరీ

వంకేశ్వరం గ్రామంలో డీసీసీబీలో అవినీతిపై ఎంక్వైరీ

అమ్రాబాద్, వెలుగు: అచ్చంపేట డీసీసీబీ బ్రాంచ్​లో 2017 నుంచి 2019 మధ్య జరిగిన అక్రమాలపై సీఐడీ ఆఫీసర్లు శుక్రవారం వంకేశ్వరం గ్రామంలో ఎంక్వైరీ చేశారు. డీసీవో పత్యా నాయక్  ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా, ఈ కేసును సీఐడీకి అప్పగించారు. మహబూబ్ నాగర్  డీఎస్పీ శంకర్, సీఐలు సైదులు, లక్ష్మణ్, సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. అచ్చంపేట డీసీసీబీ బ్రాంచ్​ పరిధిలో 1,827 అకౌంట్లలో రూ.కోటి వరకు అవకతవకలు జరిగినట్లు ఆడిటర్లు గుర్తించినట్లు సీఐ లక్ష్మణ్  తెలిపారు. 

మొదటి విడత దర్యాప్తులో భాగంగా వంకేశ్వరం గ్రామంలోని 215 మంది వాంగ్మూలం తీసుకుంటున్నట్లు చెప్పారు. వివరాలు తెలిపేందుకు చాలా మంది ముందుకు రావడం లేదని, మూడు రోజుల్లో 28 మంది మాత్రమే హాజరైనట్లు తెలిపారు. చనిపోయిన వారి పేర్లతో, భూమి లేని వారి పేర్లపై అప్పులు తీసుకున్నట్లు, రూ. లక్ష రుణం ఇచ్చినట్లు చూపి సగం దళారులు కాజేసినట్లు కొందరు తమ దృష్టికి తెచ్చారని చెప్పారు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.