
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. సినిమాలు హిట్ అయితే పర్లేదు. కానీ ఫట్ అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి ఈగలు తోలుకున్నట్టే ఉంది. కలెక్షన్లు లేక, ప్రేక్షకులు రాక కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు షోస్ క్యాన్సిల్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో.. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఊపిరి పోయాలని లేకపోతే శాశ్వతంగా మూతపడే సింగిల్ స్క్రీన్ థియేటర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుందని భావించిన ఎగ్జిబిటర్లు హైదరాబాద్లో మీటింగ్ పెట్టారు.
ఆంధ్రా, తెలంగాణ ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం ఫిల్మ్ నగర్లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో జరిగింది. ఈ సమావేశానికి ఇండస్ట్రీ నుంచి నిర్మాతలు డి.సురేష్ బాబు, దిల్ రాజ్ కూడా అటెండ్ అయి ఎగ్జిబిటర్ల సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఎక్కువ శాతం దిల్ రాజ్, సురేష్ బాబులకు చెందినవే కావడం ఇక్కడ గమనార్హం. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లు మాత్రం ఒక విషయం స్పష్టం చేశారు.
ALSO READ | మద్యం బాబులకు బిగ్ షాక్.. తెలంగాణలో లిక్కర్ ధరలు పెంపు
రెంటల్ బేసిస్లో షోలు ప్రదర్శించలేమని, పర్సంటేజ్ విధానంలో అయితేనే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాలు నడిపిస్తామని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. అయితే.. టాలీవుడ్ పెద్దలకు, ఎగ్జిబిటర్లకు ఈ ప్రతిపాదన విషయంలో సయోధ్య కుదిరినట్లు లేదు. అందుకే.. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సినిమా థియేటర్ల ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. అద్దె విధానంలో సినిమాలను ప్రదర్శించలేమని, మల్టీప్లెక్స్లకు చెల్లించినట్లు పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్ల తీర్మానించారు.