
హైదరాబాద్: మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవల బీర్ల ధరలు పెంచగా.. తాజాగా లిక్కర్ ధరలు హైక్ చేసింది. విస్కీ, బ్రాందీ క్వార్టర్‌పై రూ.10, ఆఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 చొప్పున పెంచింది. ఈ మేరకు మద్యం దుకాణాలకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆదివారం (మే 18) సర్క్యూలర్ జారీ చేసింది. ఈ పెరిగిన లిక్కర్ ధరలు 2025, మే 19 నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
అయితే.. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా తాగే చీప్ లిక్కర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపింది. బీర్ల ధరలు భారీగా పెరగడంతో చాలా మంది మందు బాబులు విస్కీ, బ్రాందీకి మారారు. తాజాగా లిక్కర్ ధరలు కూడా పెరగడంతో మద్యం ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. ఆదాయం పెంపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ రేట్లను సవరించినట్లు తెలుస్తోంది.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో బీర్ల ధరలను ప్రభుత్వం 15 శాతం పెంచిన విషయం తెలిసిందే. రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని లిక్కర్ధరల నిర్ణయ త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా ఎక్సైజ్ శాఖ ధరల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు ఇచ్చింది.15 శాతంగా లెక్కిస్తే ఒక్క బీరు ధర రూ.150 ఉంటే వ్యాట్, ఎక్సైజ్ సుంకంతో కలిపి రూ.180 దాకా పెరగనుంది. ఎక్కువ రేట్లు ఉన్న బీర్లు.. మరింత పెరగనున్నాయి.
ALSO READ | మీర్ చౌక్ ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా
వాస్తవానికి రాష్ట్రంలో మద్యం ధరలు పెంచొద్దని ముందుగా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. పక్క రాష్ట్రాల్లో ధరలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో మద్యం ధరలను ప్రధానంగా బీర్ల ధరలు పెంచాలని లిక్కర్ కంపెనీలు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్చేస్తున్నాయి. రాష్ట్ర మద్యం మార్కెట్‌లో దాదాపు 60 శాతం వాటా ఉన్న మల్టీనేషనల్ బీర్ల కంపెనీ తమకు ప్రస్తుతం చెల్లిస్తున్న బేసిక్ ధర మీద కనీసం 30.1 శాతం అదనపు ధర చెల్లించాలని కోట్ చేసింది.
ఈ కంపెనీ డిమాండ్‌నే మిగితా కంపెనీలూ అనుసరించాయి. ఈ నేపథ్యంలోనే త్రిసభ్య కమిటీ కూడా ధరలను 15 నుంచి 19 శాతం పెంచేందుకు నివేదిక ఇవ్వగా.. 15 శాతం బీర్ బేసిక్ ధర పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. తాజాగా లిక్కర్ ధరలను పెంచింది.